తెలంగాణలో తాజాగా ఓటర్ల లెక్క తేలింది

Update: 2019-12-17 07:47 GMT
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లకు సంబంధించిన సరికొత్త ముసాయిదా బయటకు వచ్చింది. తాజా లెక్కల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 2.98కోట్లుగా తేలింది. పురుష ఓటర్లకు.. మహిళా ఓటర్లకు మధ్య అంతరం బాగా తగ్గినట్లుగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. రాష్ట్రం మొత్తమ్మీదా 1.5లక్షలు మాత్రమే వీరిద్దరి మధ్య వ్యత్యాసంగా చెబుతున్నారు. ఇక.. ఓటర్ల విషయానికి వస్తే హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.16లక్షల మంది ఓటర్లు ఉండగా.. అతి తక్కువగా ములుగు జిల్లాగా తేలింది. ఈ జిల్లాలో కేవలం 2.13 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఉండటం గమనార్హం.

హైదరాబాద్ తర్వాత అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాగా రంగారెడ్డి నిలిచింది. ఈ జిల్లాలో 30.14లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్నప్పటికీ.. అత్యధిక ఓటర్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్కటి హైదరాబాద్ జిల్లాకు చెందినది లేకపోవటం విశేషం. రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన శేరిలింగంపల్లి నిలిచింది. ఈ నియోజకవర్గంలో 6.25లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

ఓ రకంగా చూస్తే.. కొన్ని జిల్లాల ఓటర్ల సంఖ్య కంటే కొన్ని రెట్లు అధికరంగా ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండటం గమనార్హం. తర్వాతి స్థానం కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంగా నిలిచింది. ఈ నియోజకవర్గంలో ఏకంగా 5.76 లక్షల మంది ఓటర్లు ఉండగా తర్వాతి స్థానంలో మేడ్చల్ అసెంబ్లీ నిలిచింది. ఇక్కడ 5.46 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. తర్వాతి స్థానంలో ఎల్ బీ నగర్ (5.17లక్షలు).. ఉప్పల్ (4.76లక్షలు) అసెంబ్లీ నియోజకవర్గాలు నిలిచాయి.

2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీయువకులతో పాటు.. ఇతర ప్రజలు సైతం ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక సవరణ షెడ్యూల్ ను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. ముసాయిదా జాబితాపై జనవరి 15 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. సవరించిన అనుబంధ ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 4న ముద్రించి.. తుది జాబితాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తారు. ముసాయిదా జాబితాను www.ceotelangana.nic.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం మీ ఓటు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
Tags:    

Similar News