'బ‌తుక‌మ్మ' గిన్నిస్ రికార్డు ఫెయిల్‌

Update: 2017-09-29 06:17 GMT
ఇటీవ‌ల కాలంలో ప‌లు అంశాల్లో గిన్నిస్ బుక్ లో చోటు సాధించేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌టం.. స‌క్సెస్ కావ‌టం తెలిసిందే. అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి తాజాగా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్న‌మైన తంగేడు పువ్వు ఆకారంలో మూడు వేల మంది మ‌హిళ‌లతో ఆకృతి రూపొందించ‌టం.. ఒకేసారి 3వేల మంది మ‌హిళ‌ల‌తో బ‌తుక‌మ్మ‌ల‌ను చేసి గిన్నిస్ లో ఎక్కాల‌న్న ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది.

తెలంగాణ వ్యాప్తంగా బ‌తుక‌మ్మ‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని  ప్ర‌తి మూల‌న బ‌తుక‌మ్మ‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడిపోతున్న రోజులివి. అలాంటి వేళ‌.. బ‌తుక‌మ్మ‌ల‌తో గిన్నిస్ ఎక్కాల‌న్న ప్ర‌య‌త్నం ఫెయిల్ కావ‌టం గ‌మ‌నార్హం. చిత్ర‌మైన  విష‌యం ఏమిటంటే.. ఈ కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏర్పాటు చేసినా వైఫ‌ల్యం కావ‌టంపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

గిన్నిస్ బుక్ ఫెయిల్ కావ‌టానికి కార‌ణం.. త‌గినంత‌మంది మ‌హిళ‌లు లేక‌పోవ‌టం. ఎల్బీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన తాజా ప్ర‌య‌త్నంలో అధికారుల నిర్లక్ష్యం కార‌ణంగానే గిన్నిస్ రికార్డు ప్ర‌య‌త్నం ఫెయిల్ అయ్యింద‌ని చెప్పాలి. ఈ రికార్డు కోసం అవ‌స‌ర‌మైన 3వేల మంది మ‌హిళ‌ల్ని స‌మీక‌రించ‌టంలోనూ.. వారికి అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇవ్వ‌టంలో చోటు చేసుకున్న నిర్ల‌క్ష్యంతోనే ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది.

మ‌రింత దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. తంగేడు పువ్వు ఆకారంలో మ‌హిళ‌ల్ని పేర్చి.. రికార్డులోకి ఎక్కాల‌న్న ప్ర‌య‌త్నంలో కొంద‌రు మ‌హిళ‌లు సొమ్మ‌సిల్లి ప‌డిపోవ‌టం చూస్తే.. అధికారుల ఏర్పాట్లు ఎంత పేల‌వంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. గిన్నిస్ ప్ర‌తినిధులు రెండు సార్లు అవ‌కాశం క‌ల్పించిన‌ప్ప‌టికీ ఈవెంట్‌ ను పూర్తి చేయ‌లేక‌పోవ‌టంతో గిన్నిస్ ప్ర‌య‌త్నం ఫెయిల్ అయ్యింది.

గిన్నిస్ ఫీట్ కోసం గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కే కార్య‌క్ర‌మం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. స్టేడియంలో మ‌హా తంగేడు పువ్వు ఆకృతి.. 3వేల బ‌తుక‌మ్మ‌ల ఏర్పాట్లు.. మ‌హిళ‌లు స్టేడియంకు రావ‌టానికి ఆల‌స్యం కావ‌టం.. అవ‌స‌ర‌మైనంత మంది మ‌హిళ‌లు లేక‌పోవ‌టంతో బ‌తుక‌మ్మ గిన్నిస్ ఫీట్ ఫెయిల్ అయ్యింది. అధికారుల అల‌క్ష్యం.. ప్ర‌కృతి క‌రుణించ‌క‌పోవ‌టంతో రెండు రికార్డుల సాధ‌న సాధ్యం కాలేదు.

గిన్నిస్ ఫీట్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసేందుకు క‌ర్ణాట‌క నుంచి 8 ట‌న్నుల బంతిపువ్వుల్ని ప్ర‌త్యేకంగా తెప్పించారు. అదే స‌మ‌యంలో బాన్సువాడ‌.. నిజామాబాద్ నుంచి 10 డీసీఎం వ్యాన్ల‌లో గునుగు పూలు.. ఖ‌మ్మం.. హైద‌రాబాద్ స‌మీప ప్రాంతాల నుంచి ఒక డీసీఎం వ్యాన్ తంగేడు పూలు తెప్పించారు. ఇంత భారీగా పూలు తెప్పించ‌టంలో స‌క్సెస్ అయిన తెలంగాణ సాంస్కృతి శాఖ అధికారులు రికార్డు సాధ‌న‌కు అవ‌స‌ర‌మైన మూడువేల మంది మ‌హిళ‌ల్ని తీసుకురావ‌టంలోనూ.. అనుకున్న టైమ్‌ కు చేయ‌టంలోనూ ఫెయిల్ అయ్యారు. ఈ రికార్డుల సాధ‌న కోసం మ‌రోసారి అవ‌కాశం ఇస్తామ‌ని గిన్నిస్ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. బ‌తుక‌మ్మ గిన్నిస్ రికార్డు ఫీట్ ఫెయిల్ కావటానికి మించిన వైఫ‌ల్యం మ‌రొక‌టి ఉండ‌దేమో? ఏంది కేసీఆర్‌.. మీ రాజ్యంలో ఇలా జ‌రుగుడేంది?
Tags:    

Similar News