కంటి ముందు ప్రాణం పోతున్నా పట్టించుకోని మంత్రి

Update: 2016-12-20 12:19 GMT
వందల కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలేనిది ప్రాణం. కంటి ముందు నిండు ప్రాణం పోతుంటే..కాపాడి ప్రాణాల్ని నిలపటానికి మించిన పని మరొకటి ఉండదు. ప్రజల కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధమని చెప్పే నేతలు.. ప్రాణాప్రాయంతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుడి విషయంలో ఎలా రియాక్ట్ అవుతారన్న విషయానికి సంబంధించి తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కంటి ముందు సామాన్యుడు ఒకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. తనకేం పట్టనట్లుగా వెళ్లిపోయిన తెలంగాణ మంత్రి చందూలాల్ వైఖరిని పలువురు తప్పు పడుతున్నారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. సోషల్ మీడియాలో మంత్రిని పెద్ద ఎత్తున చివాట్లు పెడుతున్నారు.

జయశంకర్ భుపాల్ జిల్లాలోని పాలంపేట్ గ్రామం నల్లకలువ క్రాస్ రోడ్స్ మీద ఆదివారం మధ్యాహ్నం ఒక యాక్సిడెంట్ జరిగింది. తాడూరి మధుసూదనాచారి అనే యువకుడు తన మిత్రులతో కలిసి గుడికి వెళ్లి బైక్ మీద తిరిగి వస్తుండగా.. వేగంగా వస్తున్న ట్రక్ ఒకటి వారి వాహనాన్ని ఢీ కొని ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో చారి అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ఇద్దరు స్నేహితులు గాయాలపాలయ్యారు. అక్కడి స్థానికులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులకు సాయం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

అదే సమయంలో మంత్రి చందూలాల్ కాన్వాయ్ ఆ దారి వెంట వెళుతోంది. మంత్రి కారు ముందు సీట్లో చందూలాల్ కూర్చున్నా.. ఆపకుండా వెళ్లిపోయిన ఉదంతంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. మానత్వంతో కారును ఆపి ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తనకేం పట్టనట్లుగా వెళ్లిపోయిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై మంత్రి స్పందన మరింత మంట పుట్టేలా ఉందని చెప్పాలి. తన బంధువు ఒకరికి సీరియస్ గా ఉందని చెప్పటంతో హడావుడిగా తాము వెళుతున్నామని.. రోడ్డు పక్కన పడి ఉన్న దేహాన్ని చూశానని.. కానీ.. ఆపే టైం లేకపోవటంతో ఆపలేకపోయినట్లుగా ఆయన చెబుతున్నారు. మంత్రి కాన్వాయ్ ఆపకుండా వెళుతున్న ఫోటోను ఒకరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ వ్యవహారం బయట ప్రపంచానికి తెలిసిందే. మంత్రులుగా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు.. కాస్తంత మానవత్వంతో వ్యవహరిస్తే బాగుంటుంది.కానీ.. అలాంటివి లేని వారు అత్యున్నత స్థానాల్లో ఉంటే ప్రజలకు ఎంత ప్రయోజనమో తాజా ఉదంతం చెప్పకనే చెబుతుందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News