స్టేషన్ లో ప్రతాపం చూపించిన ఎమ్మెల్యే

Update: 2015-12-13 03:58 GMT
ఆవేశం ఉండాలి. కానీ.. అది అదుపులో ఉండాలి. ఎప్పుడెంత మోతాదులో పవర్ ను ప్రదర్శించాలో అంతే చూపించాలి. ఆ విషయంలో ఏదైనా తేడా వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బాగానే అర్థమై ఉంటుంది. ఉస్మానియా వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన ఆయన్ను.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ముందుగా అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

అనంతరం ఆయనపై కేసు పెట్టినట్లుగా పోలీసులు ప్రకటించారు. బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తేనే కేసులు పెట్టేస్తారా? అన్న సందేహం కొందరిలో కలిగింది. ఈ విషయం మీద ఆరా తీస్తే.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీడియా మైకుల ముందు.. రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రదర్శించే అగ్రహాన్ని రాజాసింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రదర్శించారని చెబుతున్నారు. అదే.. ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టిందని చెబుతున్నారు.

ఉస్మానియా వర్సిటీ దగ్గర్లో రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మామూలుగా అయితే.. వేడి తగ్గిన తర్వాత వదిలేస్తారు. కానీ.. రాజాసింగ్ వెనుకాముందు చూసుకోకుండా.. పోలీస్ స్టేషన్ లో తన పవర్ ప్రదర్శించారట. పోలీసుల్ని వెనుకాముందు చూసుకోకుండా తిట్టేశారట. ఈ విషయాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యాయట. ఈ విషయాన్ని చెక్ చేసుకున్న పోలీసు అధికారులు.. తమదైన శైలిలో కేసులు కాస్త టైట్ గా బిగించేశారట. నోటిని అదుపులో ఉంచుకోకపోతే ఇలాంటి తిప్పలు తప్పవు మరి.
Tags:    

Similar News