తాజా గెలుపు గులాబీ నేతలు చంకలు గుద్దుకునేంత పెద్దదా?

Update: 2021-03-21 23:30 GMT
విజయం అంటే ఎలా ఉండాలో టీఆర్ఎస్ అధినేతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. ఆయనే ఇప్పటికి ఎన్నో జయాపజయాల్ని ఎదుర్కొన్నారు. దెబ్బలు తగిలే కొద్దీ రాటుదేలుతారన్న మాటకు తగ్గట్లే.. తనకు ఎదురైన ఎన్నో ఇబ్బందుల్ని ఓపికతో.. సహనంతో అధిగమించారు కేసీఆర్. తాజాగా జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వైనంపై గులాబీ అధినేత మొదలుకొని గులాబీ నేతలంతా పండుగ చేసుకుంటున్నారు. వారి ఆనందం.. ఉత్సాహాన్ని చూస్తుంటే.. గెలుపు కోసం వారెంతగా తపిస్తున్నారో అర్థం కాక మానదు.

వీరి ఆనందం సరే.. నిజంగానే తాజా గెలుపు.. గులాబీ నేతలు పండుగ చేసుకునేంత పెద్దదా? ఆనందంతో చిందులు వేసేంత విషయం ఉందా? అంటే.. లేదనే చెప్పాలి. చెట్లు మెలవని చోట అముదం చెట్టే మహా వ్రక్షమన్న సామెతకు తగ్గట్లే.. ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గులాబీ నేతలకు  తాజాగా వచ్చిన గెలుపునకు అవసరానికి మించి స్పందిస్తున్నారని చెప్పాలి.

సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు వ్యవహారంలో నల్గొండ ఎన్నికనే తీసుకుందాం. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఆయనకు వచ్చిన అధిక్యత 12,806. మొత్తం పోలైన 3.86 లక్షల ఓట్లలో ఆయనకు వచ్చిన ఓట్లకు.. రెండోస్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే.. 2015లోనూ పల్లా.. తీన్మార్ మల్లన్న ఇద్దరు బరిలోదిగారు. అప్పట్లో 21 మంది అభ్యర్థులే బరిలో నిలిస్తే.. ఇప్పుడు ఏకంగా 71 మంది నిలిచారు.

2015లో జరిగిన ఎన్నికల్లో 1.53 లక్షల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లతో పోలిస్తే.. సగం కంటే తక్కువ. అప్పట్లోనూ పల్లా రెండో ప్రాధాన్యత ఓట్లలెక్కింపులోనే బయటపడ్డారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పల్లాకు మొదటి ప్రాధాన్యతలో 1.10లక్షల ఓట్లు వస్తే.. మల్లన్నకు 83వేల చిల్లర.. కోదండరామ్ కు70వేల చిల్లర ఓట్లు వచ్చాయి. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 39వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 27.5వేల వచ్చాయి. అంటే.. పల్లాకు ప్రత్యర్థిగా నిలిచిన నేతలు పెద్ద ఎత్తున ఉండటంతో వ్యతిరేక ఓట్లు భారీగా చీలిపోయాయి.

ఈ కారణంతోనే పల్లా బయటపడ్డారు కానీ.. విపక్షాలన్ని కలిసి ఒకే అభ్యర్థిని బరిలో దించితే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లను చూస్తే.. పల్లాకు 1.61లక్షల ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 1.49లక్షల ఓట్లు వచ్చాయి. ఒకవేళ.. బరిలో కోదండరాం.. ప్రేమేందర్ రెడ్డి.. రాములు నాయక్ లాంటి వారు లేకుంటే.. సీన్ మరోలా ఉందంటున్నారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్ని టీఆర్ఎస్ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదో తెలిసిందే. పోలింగ్ వేళ ఓట్లు వేసేందుకు వారెంతగా కష్టపడింది తెలిసిందే. వారు పెట్టిన ఖర్చు.. చేసిన శ్రమ.. నడిపిన మంత్రాంగం లాంటివి పరిగణలోకి తీసుకుంటే.. పల్లా గెలిచి ఉండొచ్చు కానీ.. నైతికంగా మాత్రం తీన్మార్ మల్లన్ననే గెలిచిన భావన కలుగుతోందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News