మునుగోడు ముందర.. విద్వేష మత్తులో బీజేపీ.. లిక్కర్ మాయలో టీఆర్ఎస్.. కాంగ్రెస్సే స్వచ్ఛంగా

Update: 2022-08-25 01:30 GMT
మునుగోడు ఉప ఎన్నికకు కదనం జరుగుతోంది. అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలోని అధికా టీఆర్ఎస్ ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బహిరంగ
సభ నిర్వహించింది. బీజేపీ అయితే తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా ఏకంగా కేంద్ర హో మంత్రి అమిత్ షాను రప్పించి బహిరంగ సభ నిర్వహించింది. అయితే,
వీటి కంటే ముందే కాంగ్రెస్ కాస్త మేల్కొంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చురుగ్గా వ్యవహరించి మునుగోడు నియోజకవర్గ కేంద్రం చండూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తద్వారా
కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన క్షేత్రస్థాయి వ్యవహారం ఇదంతా.

అభ్యర్థుల వేటలో పార్టీలు

బీజేపీ ఎలాగూ రాజగోపాల్ రెడ్డిని మునుగోడు అభ్యర్థిగా బరిలో దించుతుంది. టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి ఎవరనేది తేల్చేందుకు సమయం తీసుకుంటోంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసేదెవరో
ఆరా తీసేందుకు బుధవారం సమావేశం నిర్వహిస్తున్నారు. కాగా, మునుగోడుకు ఏది కావాలంటే అది ఇస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం అనాదిగా
ఉన్న పునాదిని నమ్ముకుని ముందుకెళ్తోంది. చాలాకాలంగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినందున కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ చురుగ్గా ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో దీన్ని
ఆసరాగా చేసుకునే ముందుకెళ్లాలని హస్తం పార్టీ భావిస్తోంది.

అనూహ్యంగా వివాదాలతో

రాజకీయాల్లో ఎన్నికలంటేనే సోపానం. అందులో గెలవడమే పరమోద్ద్దేశం. ఈ కోణంలో చూస్తే ప్రతి ఎన్నిక కీలకమైనదే. అందులోనూ మరికొద్ది నెలల్లో ఎన్నిక జరుగనున్న రాష్ట్రంలో
పరిణామాలు వేగంగా మారుతుంటాయి. రాజకీయంగా మార్పులు చోటుచేసుకుంటాయి. తాజాగా చూస్తే.. మునుగోడు ఉప ఎన్నిక ముందు రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్ఎస్
అధినేత, సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై వచ్చిన ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలు ప్రకంపనలు రేపాయి.

ఇది ఢిల్లీ స్థాయిలో జరిగిన వ్యవహారం కావడం.. కేంద్ర సంస్థల సోదాలతో విషయం సంచలనమైంది. దీనిపై అధికార, ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నాయి. ఇప్పటికీ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందో చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉండగానే.. బీజేపీ ఎమ్మెల్యే, వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరయిన రాజాసింగ్ తనదైన రీతిలో వార్తల్లోకి వచ్చారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షోకు అనుమతివ్వడాన్ని గట్టిగా నిరసించిన ఫారూఖీ అందుకుతగ్గట్లే తన స్పందన ఉంటుందని హెచ్చరించారు. దానిని నిజం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో మంగళవారం రాష్ట్ర రాజకీయం మొత్తం రాజాసింగ్ చుట్టూనే తిరిగింది. ఇక ఈ విషయం బీజేపీ అధిష్ఠానం పరిధిలోకీ వెళ్లడంతో రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్సెండ్ చేశారు.

కాంగ్రెస్సే నిర్మలంగా

మునుగోడు ఎన్నికల ముంగిట జరిగిన ఈ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనించకుండా ఉండరు. టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కవితపై వచ్చిన ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణల్లో
నిజమెంతో తేలాల్సి ఉంది. దీనిని టీఆర్ఎస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి. ఒకవేళ నిర్దోషిగా తేలితే ఓ మహిళను ఇరికించే ప్రయత్నం చేశారన్న అపవాదును బీజేపీ మోయాల్సి ఉంటుంది. మరోవైపు రాజాసింగ్ దెబ్బతో బీజేపీపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది.

ఎంత హిందూత్వ పార్టీ అయినా.. సమాజంలో అశాంతి రేపే విద్వేష వ్యాఖ్యలను సహించలేదు. ఒకవేళ సహిస్తే తటస్థ ఓటర్లు, సమాజంలో ప్రశాంతత కోరుకునేవారు ఆ పార్టీకి ఓటేయరు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే.. తీవ్ర వివాదాస్పద అంశాలతో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ జనంలో పలుచబడితే.. కాంగ్రెస్ మాత్రమే ఎటువంటి వివాదం లేకుండా నిమ్మలంగా ఉంది.
Tags:    

Similar News