ఊరికో ఎస్సై, మండలానికో డీసీపీ.. మునుగోడు మామూలుగా లేదు

Update: 2022-10-20 09:30 GMT
మునుగోడు ఉప ఎన్నికల పోరు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అధికార టీఆర్ఎస్ గెలుస్తుందా? లేక రాజీనామా చేసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుస్తుందా? మధ్యలో కాంగ్రెస్ ఈ సీటును ఎగరేసుకుపోతుందా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ మూడు పార్టీలు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో మొత్తం నేతలంతా మోహరించారు. ఇక కోట్లలో డబ్బులు చేతులు మారుతోందని.. డబ్బుల ప్రవాహం కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి.

మునుగోడులో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల అధికారులకు, పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా  అందరి దృష్టి మునుగోడు ఉప ఎన్నికలపైనే ఉండడంతో ఏ చిన్న సంఘటన జరిగినా అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో మునుగోడు ఉప ఎన్నికపైనే ఎన్నికల అధికారులు, పోలీసులు ప్రత్యేకమైన నిఘా పెట్టే పరిస్థితి నెలకొంది.

మునుగోడు ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం భువనగిరి, నల్గొండ జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరికి ఒక ఎస్సై, మండలానికి ఒక డీసీపీ మునుగోడులో సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పోలీసు బలగాలు సైతం మోహరించారు. దీంతో మునుగోడు ఇప్పుడు పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న పోలీస్ శాఖ ఉప ఎన్నికలకు సంబంధించి పోలీసులకు విధులను నిర్ధేశించింది.

మునుగోడులోని ఒక చౌటుప్పల్ మండలానికి ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కలిపి 400 మంది విధులు నిర్వహిస్తుండడం విశేషంగా మారింది. సంస్థాన్ నారాయణపురంలో 300 మంది విధుల్లో ఉన్నారు. ఇక సమస్యాత్మాక ప్రాంతాలు ఉంటే అక్కడ అనదంగా బలగాలను మోహరిస్తున్నారు. వేలాదిగా రాష్ట్ర, కేంద్ర బలగాలుమునుగోడు ఉప ఎన్నిక సజావుగా జరగడానికి పహారా కాస్తున్నాయి.

మునుగోడులో మొత్తం 48 సున్నిత గ్రామాలను, 104 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.సీపీ మహేష్ భగవత్ ఈ పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నారు.

మునుగోడు ఉప ఎన్నికకు, ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీల నాయకులు ఎంత మంది అయితే రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారో వారికి తగినట్టుగా పోలీసులు కూడా అంతే స్తాయిలో ఉన్నారు. అమిత్ షా నుంచి జేపీ నడ్డా, కేసీఆర్ వరకూ ఎంతో మంది జాతీయ, రాష్ట్ర నేతల ప్రచారం నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News