మంత్రులున్న జిల్లాల కంటే లేని జిల్లాలే ఎక్కువే..

Update: 2016-10-06 07:31 GMT
తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న జిల్లాల స్వరూపంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  మొదట్లో అనుకున్నట్లు కాకుండా.. మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కొత్త.. పాత అని కలుపుకుంటే 31జిల్లాలుగా మారుతున్నాయి. గతంలో జిల్లాకు ఒక మంత్రి అయినా ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్తలు తీసుకునే వారు. జిల్లాకు ఒకరన్న లెక్కతో పాటు..సామాజిక అంశాల ప్రాతిపదికన.. ప్రభుత్వాల మైండ్ సెట్ కు తగ్గట్లు కొన్నివర్గాల వారికి పెద్ద పీట వేయటం.. మరికొన్ని వర్గాల వారికి మంత్రివర్గంలో తక్కువ చోటు కల్పించటం లాంటివి ఉండేవి.

ఈ సామాజిక లెక్కల పంచాయితీ ఎలా ఉన్నా.. తాజాగా మారిన తెలంగాణ జిల్లాల ముఖ చిత్రం పుణ్యమా అని.. మంత్రులు ఉండే జిల్లాల కంటే మంత్రులు లేని జిల్లాలే ఎక్కువగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో ఐదు రోజుల్లో కొత్త జిల్లాలు కొలువు తీరనున్న వేళ.. ఇప్పటివరకూ ఉన్న లెక్కల ప్రకారం మొత్తం 31 జిల్లాల్లో 15 జిల్లాలకు మంత్రులు ప్రాతినిధ్యం వహించని పరిస్థితి. ఇప్పుడున్న మంత్రులు పదకొండు జిల్లాలకే పరిమితం కావటం.. వారిలో కొందరు.. రెండేసి.. మూడేసి జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే.. మంత్రులు ప్రాతినిధ్యం వహించే జిల్లాల కంటే ప్రాతినిధ్యం  వహించని జిల్లాలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన తర్వాత.. జిల్లాల వారీగా మంత్రుల్ని ఎలా ఏర్పాటు చేస్తారు? అన్నది పెద్ద ప్రశ్నగా మారుతుందని చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు మార్పులు చోటు చేసుకోకున్నా.. భవిష్యత్తులో కొత్త జిల్లాల పుణ్యమా అని.. కొన్ని జిల్లాల నేతలకు మంత్రి వర్గంలో అవకాశాలు లభించని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పొచ్చు.

మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు.. ప్రాతినిధ్యం లేని జిల్లాల్ని చూస్తే..

మంత్రులు ఉన్న జిల్లాలు..

సిద్ధిపేట - వికారాబాద్ - సూర్యాపేట - సిరిసిల్ల - మహబూబ్ నగర్ - ఖమ్మం - వరంగల్ అర్బన్ - భూపాలపల్లి - అదిలాబాద్ - నిర్మల్ - హైదరాబాద్ (ఈ ఒక్కజిల్లాలోనే నలుగురు మంత్రులు ఉండటం గమనార్హం. మహమూద్ అలీ..నాయిని నర్సింహారెడ్డి.. తలసాని శ్రీనివాస్ యాదవ్.. టి.పద్మారావు)

మంత్రులు లేని జిల్లాలు (ఇప్పటివరకూ ఉన్న జిల్లాల ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రమే)

మెదక్ - సంగారెడ్డి - శంషాబాద్ - మల్కాజ్ గిరి - నల్గొండ - యాదాద్రి - జగిత్యాల - పెద్దపల్లి - కొత్తగూడెం - వరంగల్ రూరల్ - జనగాం - మహబూబాబాద్ - మంచిర్యాల - అసిఫాబాద్.

ఒకటి కంటే ఎక్కువ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు

= నిజామాబాద్.. కామారెడ్డి (మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి)

= కరీంనగర్.. వరంగల్ అర్బన్ (మంత్రి ఈటెల రాజేందర్)

= వనపర్తి.. నాగర్ కర్నూలు (మంత్రి జూపల్లి కృష్ణారావు)

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News