ఇది హైదరాబాదా? పాకిస్థానా!?

Update: 2015-04-09 13:30 GMT
కరుడుగట్టిన ఐఎస్‌ఐ ఉగ్రవాది వికారుద్దీన్‌, అతని గ్యాంగ్‌ ఎన్‌కౌంటర్‌.. తదనంతర పరిణామాలపై తెలంగాణవ్యాప్తంగా ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఆ ఎన్‌కౌంటర్‌ను బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ఖండించడం వరకూ చాలామంది చేస్తారు. ఉగ్రవాదుల చేతులకు బేడీలు ఉన్నప్పుడు కాల్పులు జరగడంతో ఆ అనుమానాలు రావడం కూడా సహజమే. కానీ, బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, దానిపై విచారణ జరగాలని కోరడం వరకూ సమంజసమేనని కూడా పోలీసులు వివిధ వర్గాలు అంటున్నాయి. కానీ, కొంతమంది మరిన్ని అడుగులు ముందుకు వేశారని అంటున్నారు.

ఉగ్రవాదులకు అంత్యక్రియలు నిర్వహిస్తే దానికి సాక్షాత్తూ ఒక ఎమ్మెల్యే హాజరయ్యాడు. ఆ పార్టీ అధినేత ఎన్‌కౌంటర్‌పై రోజుకోసారి అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక సాక్షాత్తూ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కూడా 'హమ్‌ కో భీ దుఖ్‌ హై' అని వ్యాఖ్యానించడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్లంతా ఉగ్రవాదులన్న విషయం అందరికీ తెలుసు. పోనీ, ఈ ఉగ్రవాదులు ముస్లిములను వదిలేసి మిగిలిన వర్గాలపైనే కాల్పులు జరపడం లేదు. ఉగ్రవాద దాడుల సందర్భంగా ముస్లిములను కూడా విచక్షణ రహితంగా చంపేస్తున్నారు. ఇంట్లోని తల్లిదండ్రులు, భార్యాపిల్లలు సహా వీరి వలన సమాజంలోని కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఉపయోగం లేదు. అయినా, పవిత్ర భారతదేశంలో వారి అంత్యక్రియలను ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రజా ప్రతినిధులు దానికి హాజరవుతున్నారని, ప్రభుత్వంలోని మంత్రులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఇవన్నీ చూస్తుంటే పాకిస్థాన్‌లో ఉన్నామో హైదరాబాద్‌లో ఉన్నామో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.



Tags:    

Similar News