'మన వాళ్ళు Briefed Me' సీన్ జస్ట్ మిస్ అట

Update: 2022-10-28 04:21 GMT
'కొడితే అలా ఇలాంటి దెబ్బ కాదు.. మళ్లీ కోలుకోకూడదు' అన్నట్లుగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉంటుందని చెబుతారు. తన రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ తీసేందుకు ఆయన అనూహ్యమైన ఎత్తుగడల్ని ప్రదర్శిస్తుంటారు. తనతో పెట్టుకునే వారెవరూ మళ్లీ లేవకుండా చేయటంలో కేసీఆర్ కున్న ట్రాక్ రికార్డు అలాంటి ఇలాంటిది కాదన్న సంగతి తెలిసిందే.

తమ పార్టీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యేను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బుట్టలో వేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ప్లాన్ చేయటం.. అది కాస్తా బెడిసికొట్టటమే కాదు.. ఆయన మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేప్ బయటకు రావటం పెను సంచలనంగా మారింది.

ఈ ఆడియోలో.. 'మన వాళ్ళు Briefed Me' అన్న మాట పాపులర్ కావటమే కాదు.. చంద్రబాబు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. అదే సమయంలో కేసీఆర్ తో గేమ్ లు ఆడాలన్న ఆలోచనను చాలామందిలో చంపేసింది ఈ ఎపిసోడ్.

తాజాగా అలాంటి సీన్ ను రిపీట్ చేయాలని సీఎం కేసీఆర్ భావించినట్లుగా చెబుతారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తాన్ని ఎర వేసి.. పార్టీలో చేర్చుకునేందుకు మధ్యవర్తులతో డీల్ సెట్ చేసుకున్న ఎపిసోడ్ ను తనకు అనుకూలంగా మార్చుకోవటంతో పాటు.. బీజేపీ అధినాయకత్వానికి దిమ్మ తిరిగేలా అనుభవాన్ని రుచి చూసేలా ప్లాన్ చేసినట్లుగా చెబుతారు. ఈ ప్లాన్ లో భాగంగా.. బీజేపీకి చెందిన టాప్ 2 నేతను లైన్లోకి తీసుకొచ్చి.. ఆయన వాయిస్ ను రికార్డు చేసేందుకు అవసరమైన ప్లాన్ మొత్తాన్ని సెట్ చేసినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఆయన్ను ఫోన్ లో మాట్లాడించేందుకు ప్లాన్ చేసినప్పటికీ.. తెలియని కారణంగా ఆయన లైన్లోకి రాలేదు. అయితే.. సదరు ముఖ్యనేత వ్యక్తిగత సిబ్బందితో మాట్లాడిన మాటలు.. ఆ సందర్భంగా సదరు నేత లైన్లోకి వస్తారన్న విషయాన్ని చెప్పినట్లుగా చెబుతున్న ఆడియో టేపులు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

మొత్తంగా చూస్తే.. బాబు నోటి నుంచి వచ్చినట్లుగా చెప్పే మన వాళ్ళు Briefed Me లాంటి మాటల్నే బీజేపీ టాప్ 2 పర్సన్ నోటి నుంచి వచ్చేలా ప్లాన్ చేసినప్పటికీ.. ఆ సీన్ రిపీట్ అయ్యే అవకాశం లేకుండాపోయిందంటున్నారు. సదరు నేత వాయిస్ క్లిప్ లేనప్పటికీ.. ఆయన వ్యక్తిగత సిబ్బంది వాయిస్ క్లిప్ సైతం బీజేపీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. అదెంత వరకు నిజమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News