బీజేపీ రెండో జాబితా ఇదే..ధ్వంస‌మై పార్టీ ఆఫీసు

Update: 2018-11-02 19:50 GMT
తెలంగాణ శాసనసభకు ముంద‌స్తు ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ త‌మ పార్టీ అభ్యర్థుల పేర్లకు సంబంధించి రెండో జాబితాను ఇవాళ విడుదల చేసింది. జాబితా విడుదలైన మరుక్షణమే పార్టీలోని అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. తనకు కాకుండా మరొకరికి టికెట్ కేటాయించారని.. పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తూ.. పార్టీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. 28 మందితో భాజపా ఈరోజు రెండో విడత జాబితా విడుదల చేసింది. దీనిలో భాగంగా శేరిలింగంపల్లి టిక్కెట్‌ ను యోగానంద్‌ కు - నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ ను యెండల లక్ష్మీనారాయణకు రాష్ట్ర అధిష్టానం జాబితా మేరకు కేంద్ర అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఈ రెండు స్థానాల్లో టిక్కెట్ల ఆశించి భంగపడిన నేతలు ఆందోళనకు దిగారు.

టీఆర్ ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు కేటాయించడంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న తనను కాదని.. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన బిల్డర్‌ యోగానంద్‌ కు టిక్కెట్‌ ఎలా కేటాయిస్తారంటూ పార్టీ పెద్దలను నిలదీశారు. దీనికి నిరసనగా హైదరాబాద్‌ లోని పార్టీ కార్యాలయం ఎదుట మద్దతుదారులతో కలిసి ఆయన నిరసనకు దిగారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ ను తనకే కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్‌ ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంపైనా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యెండలకు టిక్కెట్‌ కేటాయించడాన్ని నిరసిస్తూ సూర్యనారాయణ గుప్తా అనుచరులు ఆందోళన చేపట్టారు. భాజపా కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు.

ఎన్నికల వేళ ఇదంతా సాధారణ‌మే అయినా తెలంగాణలో తన పట్టు సాధించుకోవటానికి కమల దళం అసంతృప్తి నేతలతో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీలో విబేధాలు బైటపడటంతో వారిని బుజ్జగించేందుకు పెద్దస్థాయి నేతలు ప్రయత్నిస్తున్నారు. అయినా ఊరట చెందని అసంతృప్తి నేతలు తమ నిరసనను పార్టీ కార్యాలయాలపై వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News