వైరల్ గా బస్సు ఫోటో.. చూసినంతనే వణుకు ఖాయం

Update: 2020-05-21 04:15 GMT
ఒక ఫోటో ఇప్పుడు తెలుగు ప్రజలకు వణుకు పుట్టేలా చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటో వెనుకున్న విషయం భయాందోళనలకు గురి చేసేలా మారింది. ఇంతకీ ఆ బస్సు ఫోటో ఏమిటి? అంతలా వణుకు పుట్టటానికి అందులో ఏమున్నది ప్రశ్న. వాస్తవానికి.. ఆ ఫోటో ఏమిటంటే.. ఆర్టీసీ బస్సు లోపల కిక్కిరిసిన ప్రయాణికులతో ఉంటుంది. ఆర్టీసీ బస్సు అన్న తర్వాత ఆ మాత్రం రద్దీ లేకుండా ఉంటుందా? అన్న ప్రశ్న వస్తుంది.

విడిరోజుల్లో ఫర్లేదు కానీ.. మాయదారి రోగం ఎప్పుడు.. ఏ మూల నుంచి విరుచుకుపడుతుందో తెలీని పరిస్థితి ఉండటంతో అంతా అప్రమత్తంగా ఉంటున్నారు. దీనికి భిన్నంగా ఈ బస్సులో మాత్రం ప్రయాణికులు ముఖానికి మాస్కు పెట్టుకొని.. భౌతిక దూరాన్ని లైట్ తీసుకోవటం గమనార్హం. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడిదన్నది చూస్తే.. మెదక్ - జోగిపేట - సంగారెడ్డి - పటాన్ చెర్వు వెళ్లే ఆర్టీసీ సర్వీసు. సంగారెడ్డి డిపోకు చెందిన ఈ బస్సులో ఏకంగా 74 మంది ప్రయాణికులు ఎక్కారు.

మామూలు రోజుల్లో రైట్.. రైట్ అనేసేవాడు కానీ.. ఇప్పుడున్న ప్రత్యేక రోజుల పుణ్యమా అని కండక్టర్ అంతమందితో కుదరదన్నాడు. ఇలా కిక్కిరిసిపోయేలా బస్సులో ప్రయాణం ఆరోగ్యానికి ముప్పుగా మారొచ్చని ఎంతలా ప్రాథేయపడ్డా.. ఒక్కరూ వినలేదట. కిందకు దిగేందుకు ఆసక్తి చూపించలేదట. దీంతో.. భయం భయంగానే ఆ కండక్టర్ ఆ బస్సును పోనివ్వాలని కోరాడట.

లాక్ డౌన్ నిబంధనల మినహాయింపు నేపథ్యంలో కొన్ని చోట్ల ప్రయాణికుల పెద్దగా లేకుంటే.. మరికొన్ని సర్వీసులకు మాత్రం జనాలు పోటెత్తుతున్నారట. ఇలాంటి వారు తమ ప్రయాణమే తప్పించి.. తక్కినవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరట. ఇలా అయితే.. మాయదారి రోగం అంటుకునే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కిటకిటలాడే బస్సు ఎక్కకపోతే.. తొక్కలో ప్రయాణం గంటో.. రెండు గంటలో ఆలస్యమవుతుంది. కానీ.. మాయదారి రోగం అంటుకుంటే.. ఎంత ముప్పు అన్నది ఒకసారి గుర్తు చేసుకొని ప్రయాణం చేస్తే బాగుంటుందన్న సూచనను చేస్తున్నారు పలువురు. ఏమైనా.. ఇప్పుడున్న వేళలో ఇంత బాధ్యతారాహిత్యాన్ని మాత్రం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
Tags:    

Similar News