ఏపీని కాలదన్ని వస్తే షాకిచ్చిన తెలంగాణ!

Update: 2018-01-13 06:55 GMT
నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో రిటైర్మెంటు వయసు 60 ఏళ్ల వరకు ఉంది. తెలంగాణలో ప్రస్తుతం అది 58 ఏళ్లు మాత్రమే. అయినా సరే.. ఉమ్మడి సంస్థలు విభజన అయినప్పుడు.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఏపీ సర్వీసులో ఉండడం వల్ల తమకు కలిగే అదనపు ప్రయోజనాలు కూడా వద్దనుకుని తెలంగాణ సర్వీసుకు వచ్చేయాలని ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే కొందరు తెలంగాణ నుంచి ఏపీ సర్వీసులోకి వెళ్లడానికి కూడా ఆప్షన్స్ ఇచ్చారు. తీరా ఈ ఉద్యోగులు ఏపీ నుంచి రిలీవ్ అయి తెలంగాణకు వచ్చిన తర్వాత.. ఇక్కడి ప్రభుత్వం మీరు అనుభవించిన సేమ్ హోదాలు ఇవ్వడం కుదర్దు. మీ స్థాయి తగ్గించుకుని ఉద్యోగంలో చేరేట్లయితే చేరండి.. లేదంటే బలవంతంగా లీవుపై వెళ్లండి.. అంటూ వారిని విధుల్లో చేర్చుకోకుండా మోకాలడ్డుతోంది. తెలంగాణ మీది ప్రేమతో.. ఏపీలో ఉన్న అదనపు లబ్ధిని కూడా కాదనుకుని రిలీవ్ అయి సొంత రాష్ట్రానికి వచ్చినందుకు ఇదేం శిక్షరా భగవంతుడా అంటూ.. ఉద్యోగులు గొల్లుమంటున్నారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఆర్టీసీలో కనిపిస్తోంది.

విభజన చట్టం ప్రకారం.. అధికారికంగా పూర్తి విభజన జరగని కొన్ని ఉమ్మడి సంస్థల్లో ఆర్టీసీ కూడా ఒకటి. కాకపోతే బస్సులు ఆపరేట్ చేసే పరంగా మాత్రం ఆర్టీసీ రెండుగా విడిపోయింది. ఉద్యోగులను కూడా పంచుకున్నారు. ఉద్యోగుల ఆప్షన్స్ అడిగినప్పడు ఏపీకి వెళ్లడానికి కొందరు - తెలంగాణకు రావడానికి కొందరు ఆప్షన్స్ ఇచ్చారు. 2015 జూన్ లోనే పరిపాలన పరమైన ఈ విభజన జరిగిపోయింది. ఆ తర్వాతి ప్రాసెస్ లో అధికారులు ఆప్షన్స్ ఇవ్వడమూ జరిగింది. ఇన్ని నెలలు జాగు చేసిన తర్వాత.. ఏపీఎస్ ఆర్టీసీ గత నెల తెలంగాణకు ఆప్షన్స్  ఇచ్చిన 36 మంది అధికారుల్ని రిలీవ్ చేసింది. తీరా వాళ్లు తెలంగాణకు వచ్చేసరికి మా వద్ద పోస్టులు ఖాళీ లేవు పొమ్మని టీఎస్ ఆర్టీసీ అంటోంది. దీంతో వారు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. ట్విస్టు ఏంటంటే.. ఏపీ ఆప్షన్స్ ఇచ్చిన అధికార్లను టీఎస్ ఆర్టీసీ ఇప్పటిదాకా రిలీవ్ చేయలేదు. వారిని రిలీవ్ చేసేస్తే ఖాళీలు వస్తాయి కదా అని వీరి వాదన. కానీ.. మీరు స్థాయి తగ్గించుకుని కిందిలెవెల్ ఉద్యోగాల్లో చేరితే చేర్చుకుంటాం అంటూ టీఎస్ ఆర్టీసీ అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రత్యేకించి తెలంగాణ ను కోరుకుని వచ్చినందుకు ఈ శిక్ష ఏమిటా ? అని అధికారులు విస్తుపోతున్నారు.

Tags:    

Similar News