తెలంగాణ టీడీపీకి దిక్కెవ‌రు?

Update: 2018-12-18 17:31 GMT
తెలుగుదేశం తెలంగాణ శాఖ గురించి రాజకీయ వ‌ర్గాల్లోనే కాకుండా...పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమ‌యం - అసంతృప్తి నెల‌కొంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ బ్ర‌హ్మండ‌మైన విజ‌యాన్ని సాధించి సర్కారు ఏర్పాటు చేసిన ప్ప‌టికీ...ప్ర‌తిప‌క్ష పార్టీ హోదాలో ఇంకా టీడీపీ స్పందిచ‌డం లేద‌ని అంటున్నారు. రాజ‌కీయ కార‌ణాలు - తెలంగాణ‌లో ప‌రిస్థితులు - అంచ‌నాలు విఫ‌ల‌మ‌వ‌డం వంటివి తాజా ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మ‌ని అంటున్నారు. పార్టీ జాతీయ - రాష్ట్ర నాయకత్వంపై ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతోంది.జాతీయ నాయకత్వం తమ అవసరాల కోసమే తెలంగాణ శాఖను బలిచేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసమే తెలంగాణ శాఖ నేతలు - కార్యకర్తల భవిష్యత్‌ ను పణంగా పెడతారా ? అంటూ ఆగ్రహం పెల్లుబుకుతోంది. దీనికి నిద‌ర్శ‌నం పార్టీ ఆఫీసు గడ‌ప తొక్కేందుకు రాష్ట్ర స్థాయి నాయ‌కులు - ముఖ్య‌నేత‌లు ఎవ‌రూ సిద్ధంగా లేక‌పోవ‌డ‌మేన‌ని అంటున్నారు.

మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలో వెళ్లినప్పటికీ - కాంగ్రెస్‌ లో సరైన ప్రణాళిక లేక చతికిలపడ్డామని అంటున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనలోనూ - అభ్యర్థులను ప్రకటించడంలోనూ చోటుచేసుకున్న జాప్యం మరో ఐదేండ్ల పాటు అధికారానికి దూరంగా ఉండేలా చేసిందని - తీవ్ర మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. టీడీపీకి ఎన్ని సీట్లు అడిగారు - ఏమేమీ అడిగారు అనే సంగతి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం - ఆఫీసు బేరర్లకు కూడా చెప్పలేదని అంటున్నారు. 14 సీట్లు అని చెప్పి - 13 సీట్లకే భీపారాలు అందించడం - చివరకు 12 సీట్లల్లోనే అభ్యర్థులు పోటీ దిగడం పట్ల నేతల్లో పార్టీ నాయకత్వం మెతక వైఖరీని తప్పుబడుతున్నారు.ఇందులో కాంగ్రెస్‌ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి బోల్తాపడిందనే విమర్శలు టీడీపీ నుంచి వస్తున్నాయి. 12 నియోజకవర్గాలకుగాను ఇబ్రహీం పట్నంలో కాంగ్రెస్‌ బీఎస్పీకి మద్దతు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు.కాంగ్రెస్‌ తమ బలాన్ని తాను ఎక్కువగా అంచనా వేసుకుందని, అదే తరుణంలో టీడీపీ సైతం తన శక్తిని అతిగా ఊహించుకుందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. చివరకు రెండే రెండు సీట్లకు టీడీపీ పరిమితం కావాల్సి వచ్చిందని అంటున్నారు.  పార్టీ అధినేత చంద్రబాబు కూటమికి ప్రాధాన్యత ఇచ్చి - కాంగ్రెస్‌ నుంచి సమయానుకూలంగా వ్యూహరచన చేయడంలోనూ, దాన్ని అమలుచేయడంలోనూ చురుకైన నేత లేకపోవడం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని తెలుగుదేశం నేత‌లు వాపోతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెంటనే సమీక్ష చేసి - పార్టీకి దిశానిర్దేశం చేయాల్సి ఉందని - కానీ అలాంటి ప్ర‌య‌త్నాలు ఏవీ జ‌ర‌గ‌డం లేద‌ని వాపోతున్నారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్నవారిని గుర్తించలేద‌ని  టీడీపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందుకే రెండు వారాలుగా రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ భవన్‌ గడప తొక్కడం లేదనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలిచేవరకు అఫీసు వచ్చేది లేదని భీష్మించుకూర్చున్నట్టు సమాచారం.

Tags:    

Similar News