ఆత్మ‌హ‌త్య‌ల్లో ప్ర‌ముఖ స్థానంలో తెలంగాణ‌!

Update: 2020-03-05 02:30 GMT
దేశంలో ఎక్కువ‌గా ఆత్మ‌హ‌త్య‌లు న‌మోద‌య్యే రాష్ట్రం మ‌హారాష్ట్ర‌. రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌తో కూడా త‌ర‌చూ ఆ రాష్ట్రం వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక రెండో స్థానంలో ఉంది త‌మిళ‌నాడు. ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలుస్తూ ఉంది తెలంగాణ‌. దేశంలోనే చిన్న రాష్ట్రాల్లో ఒక‌టైన‌ప్ప‌టికీ.. ఆత్మ‌హ‌త్య‌ల్లో మాత్రం తెలంగాణ ఏడో స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ఈ రాష్ట్రంలో కొన్ని ఆత్మ‌హ‌త్యలు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాయి. తండ్రి ట్యాబ్ ఇవ్వ‌లేద‌ని, త‌న‌కు కాకుండా సోద‌రుడికి ఇచ్చాడ‌ని ఒక పిల్లాడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆస్తులు బాగా ఉన్నా.. ఏదో కొన్ని పాటి అప్పుల‌య్యాయ‌ని.. ఒక సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ భార్యా పిల్ల‌ల‌ను చంపి త‌నూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాయి. ఆ మాత్రం దానికి త‌నువు చాలించుకోవాలా.. అని చాలా మంది సానుభూతి వ్య‌క్తం చేశారు ఈ ఘ‌ట‌న‌లపై.

ఇలాంటి నేప‌థ్యంలో.. తెలంగాణ ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలో ప్ర‌ముఖ స్థానంలో ఉంద‌ని మీడియా ప్ర‌తినిధులు గ‌ణాంకాల‌ను ప్ర‌స్తావిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్ర‌తి రోజూ స‌గ‌టున 21 మంది ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. 2018లో న‌మోదు అయిన ఆత్మ‌హ‌త్య‌ల లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ‌లో రోజు కు అంత‌మంది వివిధ కార‌ణాల‌తో త‌నువు చాలించుకుంటున్న‌ట్టుగా ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెబుతున్నాయి. చిన్న రాష్ట్రం అయిన తెలంగాణ‌లో ఈ గ‌ణాంకాలు ఆందోళ‌న‌క‌ర‌మైనవే.

అక్ష‌రాస్య‌త త‌క్కువ‌గా ఉండి, అనేక స‌మ‌స్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచే ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బిహార్ వంటి రాష్ట్రాలు ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలో చివ‌రి స్థానాల్లో ఉన్నాయి. అయితే చ‌దువుకున్న వారు ఎక్కువ‌గా ఉండే, వాటితో పోలిస్తే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న రాష్ట్రాలైన త‌మిళ‌నాడు, కేర‌ళ‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ‌గా ఆత్మ‌హ‌త్య‌లు న‌మోదు అవుతుండ‌టం విచిత్రం అని ప‌రిశీల‌కులు అంటున్నారు.


Tags:    

Similar News