బయట పల్లకీ సంగతి తర్వాత.. ఇంట్లో ఈగల మోత చూడు సారూ?

Update: 2022-06-16 03:30 GMT
గడిచిన కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేసినట్లుగా చెబుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు హాట్ టాపిక్ గా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేతలతో భేటీ అవుతున్న ఆయన.. కేంద్రంలోని మోడీ సర్కారు వైఫల్యాల మీద విమర్శలు చేస్తున్నారు. ఇది సరిపోనట్లు సీఎం కేసీఆర్ కుమారుడు కమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం కేంద్రం వైఫల్యాల మీద తరచూ కామెంట్లు చేస్తున్నారు. విమర్శ చేసే హక్కు అందరికి ఉంటుంది. కానీ.. వేలెత్తి చూపించే వేళలో.. ఒక వేలు ఎదుటోడి వైపు చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయన్న చిన్న లాజిక్ ను గులాబీ బాస్.. ఆయన కుమారుడైన చిన్న బాస్ మరచిపోయినట్లుగా కనిపిస్తోంది.

జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయంగా తయారు కావాలన్న ఆశ మంచిదే. కానీ.. దానికంటే ముందు సొంత రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇంటిని గెలవలేనోడు.. రచ్చను గెలిచే అవకాశం లేదు. వీధిలో పల్లకి ఎక్కాలని తపిస్తున్న కేసీఆర్.. ముందు ఇంట్లో ఈగల మోతగా మారిన పలు అంశాల్ని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోయినట్లు కనిపిస్తున్నారు.

క్యాలెండర్లో పదో తారీఖు దాటిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది హోంగార్డులకు జీతాలు రాని పరిస్థితి. ఇది సరిపోనట్లు జూబ్లీహిల్స్ లోని మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్.. దానిలోని రాజకీయ కోణం ఇంకోవైపు ప్రభుత్వానికి చికాకు పుట్టిస్తోంది. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన అంతకంతకూ పెద్దది అవుతోంది. దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు క్యాంపస్ బయటకు వచ్చి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు.

తాము ఎదుర్కొంటున్న సమస్యలు.. సౌకర్యాల కొరత.. తదితర అంశాలపై ఇప్పటికే పలు మార్లు గళం విప్పినప్పటికి ప్రయోజనం లేకపోవటంతో వారు రోడ్ల మీదకు వచ్చారు. ఇంత భారీగా విద్యార్థులు క్యాంపస్ బయటకు వచ్చి  నిరసన చేపట్టటం చూసినప్పుడు.. ఇలాంటి విషయాల్ని కేసీఆర్ ఎందుకు పరిష్కరించలేకపోతున్నారన్న సందేహం కలుగక మానదు. తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. మంత్రి కేటీఆర్ కానీ రావాలని.. అప్పుడు మాత్రమే తమ ఆందోళనను విరమిస్తామని తేల్చి చెబుతున్న విద్యార్థుల మాటలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేదిగా చెప్పక తప్పదు.

ఇది సరిపోనట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన గౌరవెల్లి భూ నిర్వాసితుల విషయంలో పోలీసులు.. అధికారులు వ్యవహరించిన తీరు.. అర్థరాత్రి దాటిన తర్వాత ఆందోళన చేస్తున్న వారి ఇళ్లలోకి వెళ్లి చేసిన రచ్చ ఇప్పుడు మరో తలనొప్పిగా మారనుంది. గడిచిన మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న వారు.. తాజాగా బీజేపీ నేతలతో కలిసి రాష్ట్ర గవర్నర్ ను కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి వాపోతున్నారు. ప్రభుత్వం భూములు సేకరించినప్పుడు.. వారికి చెల్లించాల్సిన పరిహారం విషయంలో ఇలా వ్యవహరించటమా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున తెర మీదకు వస్తున్న అంశాలు తెలంగాణ అధికారపక్షం ఇమేజ్ ను దెబ్బ తీసేలా మారాయని చెప్పాలి. వీటిని పరిష్కరించే విషయంలో జరుగుతున్న జాగుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్న సీఎం కేసీఆర్.. అంతకంటే ముందు రాష్ట్రంలోని సమస్యల్ని పరిష్కరిస్తే బాగుంటుందంటున్నారు. మరి.. ఇంట్లో ఈగల మోతను కేసీఆర్ ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News