దసరాకు మీకు మందు బందే..

Update: 2019-09-28 11:19 GMT
మరో వారం రోజుల్లోనే దసరా పండుగ వస్తోంది. దసరా అంటేనే తాగడం.. తినడం.. మద్యం - మాంసం జోరుగా క్రయవిక్రయాలు సాగుతాయి.. ఇక తెలంగాణ ఆరాధ్య పండుగ బతుకమ్మ కూడా దసరాకు రెండు రోజుల ముందు ఉండడంతో ఊరు వాడా అంతా విందు వినోదాలతో మునగడం ఖాయం..

అయితే ఈ దసరా పండుగకు మద్యం కొరత తెలంగాణను పట్టి పీడించడం ఖాయమంటున్నారు. తెలంగాణ మద్యం షాపుల లైసెన్స్ గడువు సెప్టెంబర్ 30తో ముగియబోతోంది. కొత్త మద్యం పాలసీని తెలంగాణ సర్కారు ఇంకా ప్రకటించలేదు. ఏపీ లో జగన్ తెచ్చిన ‘సర్కారీ వైన్ షాపుల’ను తెలంగాణలో తెచ్చేందుకు కేసీఆర్ సర్కారు ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది.

అందుకే తాజాగా మద్యం షాపుల లైసెన్స్ ను తెలంగాణ సర్కారు మరో నెల రోజులు అంటే అక్టోబర్ 30వరకు పొడిగించింది. ఇందుకోసం ఈ నెలకు భారీగా లైసెన్స్ ఫీజును పెట్టింది. నెలకోసం పట్టణాల్లో 5 లక్షల వరకూ గ్రామాల్లో 4 లక్షలలోపు లైసెన్స్ ఫీజును పెంచింది. హైదరాబాద్ లో  -  ఇతర నగరాల్లో అయితే భారీగా ఉంది. ఈ ఫీజు నెలరోజుల్లో తిరిగి రావడం కష్టమేనని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు.

అయితే నెలరోజుల్లో ముగిసే మద్యం షాపుల లైసెన్స్ కోసం   భారీగా ఫీజును చెల్లించడానికి మద్యం షాపుల నిర్వాహకులు ఉత్సాహం చూపించడం లేదట.. ఎలాగూ తెలంగాణ సర్కారు అక్టోబర్ నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో వైన్ షాపులు పెట్టేందుకు రెడీ కావడంతో.. ఉన్న స్టాకును అమ్మేసి ఊరుకుందామనే ఆలోచనలో మద్యం షాపు నిర్వాహకులు ఉన్నారట.. అందుకే ఎవరూ మద్యం కొనుగోలుకు లైసెన్స్ ఫీజు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదట.. దీంతో మద్యం నిల్వలు అయిపోయాక తెలంగాణలో షాపులు కట్టేస్తారన్నమాట.. కొత్తగా మద్యం కొనరు.. లైసెన్స్ ఫీజు కట్టరు.

ఈ పరిణామంతో తెలంగాణలో మద్యం కొరత అనివార్యం కానుంది. మరో వారానికి సరిపడా మాత్రమే మద్యం నిల్వలు వ్యాపారుల వద్ద ఉన్నాయట.. మద్యం వ్యాపారులు నెల ఫీజు కట్టకుండా మద్యం కొనకపోతే వైన్ షాపులలో మద్యం దొరకదు. పండుగ పూట తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మద్యం కొరత వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు మద్యం షాపు యజమానులతో నెలరోజులకు లైసెన్స్ ఫీజు కట్టాలని చర్చలు జరుపుతున్నారట.. కానీ మద్యం వ్యాపారులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్టు తెలిసింది.
Tags:    

Similar News