అమెరికాలో మ‌రో తెలుగోడి మీద కాల్పులు

Update: 2017-06-08 04:53 GMT
విద్వేషం కానీ.. మ‌రింకేదైనా కార‌ణం కావొచ్చు. అగ్ర‌రాజ్యంలో ఇటీవ‌ల కాలంలో నేరాల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. పెరిగిపోయిన గ‌న్ క‌ల్చ‌ర్ తో ఇష్టారాజ్యంగా కాల్పులు జ‌రిపే సంస్కృతి ఆగ్రరాజ్యంలో అంత‌కంత‌కూ పెరుగుతోంది. తెలుగువారిపై కూడా త‌ర‌చూ కాల్పులు జ‌ర‌ప‌టం.. ఆ ఘ‌ట‌న‌ల్లో కొంద‌రు మ‌ర‌ణించిన వైనం తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగోడి మీద అమెరికాలో కాల్పులు జ‌రిగాయి.

కాల్పుల‌కు గురైన తెలుగు వ్య‌క్తి అదృష్ట‌వ‌శాత్తు.. చావు నుంచి త‌ప్పించుకుని తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఉదంతాన్ని చూస్తే.. సంగారెడ్డికి చెందిన అహ్మ‌ద్ (26)పై కాలిఫోర్నియాలో కాల్పులు జ‌రిగాయి. గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత‌నిపై కాల్పులు జ‌రిపారు. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

సంగారెడ్డికి చెందిన అహ్మ‌ద్ వైమానిక‌ద‌ళంలో ప‌ని చేస్తున్నారు. ఉద్యోగంలో భాగంగా ఆయ‌న కుటుంబంతో పాటు హైద‌రాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ గార్డెన్ ట‌వ‌ర్ లో నివాసం ఉంటున్నారు. మ‌జీబ్ కుమారుడు ముబిన్ అహ్మ‌ద్ హైద‌రాబాద్ లో బీటెక్ పూర్తి చేసి ఉన్న‌త విద్య కోసం 2015లో అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. అక్క‌డ ఒక ప్రైవేటు స్టోర్‌ లో ప‌ని చేస్తున్నారు.

ఈ నెల 4న భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 11 గంట‌ల వేళ‌లో స్టోర్‌ కి వ‌చ్చిన ఒక దుండ‌గుడు ముబిన్‌ తో వాగ్వాదానికి దిగాడు. త‌న చేతిలో ఉన్న తుపాకీతో కాల్పులు జ‌రిపాడు. దీంతో.. రెండు తూటాలు ముబిన్ కాలేయంలోకి దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయ‌ప‌డిన ముబిన్ కుప్ప‌కూలాడు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ముబిన్ ను చూసేందుకు.. అత‌డికి సాయంగా ఉండేందుకు ముబిన్ కుటుంబీకులు తెలంగాణ ప్ర‌భుత్వాన్ని సాయం కోరుతున్నారు. ఈ ఇష్యూను మంత్రి హ‌రీశ్ దృష్టికి తీసుకెళ్ల‌టంతో వీసా ఏర్పాట్లు చేసి.. వారి కుటుంబీకులను అమెరికాకు పంపుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News