హనీమూన్ ముగిసింది.. వడ్డింపులకు టెలికం కంపెనీలు రెఢీ

Update: 2019-11-19 05:27 GMT
ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. ప్రతిదానికి ఒక రేటు ఉంటుందని చెప్పే మాటలకు ఏ మాత్రం పోలిక లేని రీతిలో.. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్న రీతిలో టెలికాం కంపెనీల సేవలు ఉండటం.. కారుచౌకకు జీబీల లెక్కన డేటాను ఇచ్చేయటమేకాదు.. అవుట్ గోయింగ్ కాల్స్ ను సైతం ఉచితంగా ప్రకటించిన టెలికం సంస్థలు ఇప్పుడు తమ తీరును మార్చుకుంటున్నాయి.

మారిన విధానాలతో పాటు.. కోర్టు కేసుల్లో భాగంగా ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయిల్ని ఫైన్ల రూపంలో చెల్లించాల్సి రావటంతో టెలికం కంపెనీలు కళ్లు తెరిచాయి. ఇంతకాలం ఫ్రీ.. ఫ్రీ అంటూ ఉరించి.. ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు.. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ సెల్ ఫోన్ లో అదే పనిగా డేటా వాడేయటాన్ని విపరీతంగా అలవాటు చేసుకున్న పరిస్థితి తెలిసిందే.

మార్కెట్లో పేరున్న టెలికం కంపెనీలైన జియో.. ఎయిర్ టెల్.. వొడాఫోన్ -ఐడియా సంస్థలు ఇప్పుడు తమ చౌకబాటను వదిలేసి.. వాయింపు మార్గంలోకి నడకను షురూ చేశారు. ఒకరి మీద పోటీకి మరొకరు అత్యంత తక్కువ ధరలకు డేటా ప్లాన్లను సిద్ధం చేయటమే కాదు.. ఉచితంగా అవుట్ గోయింగ్ కాల్స్ కు అవకాశం ఇచ్చారు. అయితే.. ఈ కారణంగా తాము చెల్లించాల్సిన బిల్లులు భారీగా పేరుకుపోవటంతో జియో కళ్లు తెరిచింది. తమ నెట్ వర్క్ కు కాకుండా మరేదైనా నెట్ వర్క్ కు అవుట్ గోయింగ్ కాల్స్ చేసినప్పుడు నిమిషానికి ఆరు పైసలు చొప్పున ఛార్జీల వడ్డన ఉంటుందని.. అదే సమయంలో ఆ మొత్తానికి డేటాను ఉచితంగా అందిస్తామని చెప్పింది.

జియో ధరల వడ్డింపు ప్రకటన పూర్తి అయ్యిందో లేదో.. నెల వ్యవధిలోనే వొడాఫోన్ -ఐడియాతో పాటు తాజాగా ఎయిర్ టెల్ సైతం ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేశాయి.  డిసెంబరు ఒకటి నుంచి తమ టారిఫ్ ప్లాన్లు పెంచనున్నట్లు ప్రకటించాయి. నిన్నటి వరకూ ఉచితమన్న టెలికం కంపెనీలు.. ఇప్పుడు రివర్స్ గేర్ లో ఒకరి తర్వాత మరొకరుచొప్పున ఛార్జీల పెంపు ప్రకటన చేయటంతో రానున్న రోజుల్లో వినియోగదారులకు బిల్లు భారం పెరగనుందని చెప్పాలి. నిర్వహణ ఖర్చులతో పాటు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాలు భారీగా పెరగటంతో ఈ పరిస్థితి ఉందంటున్నారు. ఎయిర్ టెల్.. వొడాఫోన్ - ఐడియా..జియోలు కలిపితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం, కంపెనీకి ఉన్న నష్టాలు కలిపితే దాదాపు రూ.1.5లక్షల కోట్ల మేర ఉందంటున్నారు. దీంతో.. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు ఛార్జీల మోతను మొదలుపెట్టారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News