కొ-విన్ పేరు ఎలా పెట్టారో మనమ్మాయి చెప్పింది

Update: 2021-10-19 06:46 GMT
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. మన తెలుగువారు కనిపిస్తారు. అది తెలుగోళ్ల గొప్పతనం. అంతేకాదు.. చాలాచోట్ల అత్యున్నత స్థానాల్లో ఉన్న తెలుగువారు బోలెడంతమంది కనిపిస్తారు. బ్యాడ్ లక్ ఏమంటే.. అలాంటి వారికి సంబంధించిన వివరాలు చాలా తక్కువగానే బయటకు వస్తుంటాయి. మారిన పరిస్థితులు.. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు కొన్ని వివరాలుబయటకు వస్తున్నాయి. తాజాగా హెచ్ సీయూ పూర్వవిద్యార్థిని.. తెలుగమ్మాయి శ్రీదేవి పాతికేళ్ల చిరుప్రాయంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పని చేసింది.
కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా కేంద్రం రూపొందించిన కొవిన్ యాప్ లో ఆమె భాగస్వామ్యమైంది. చిరుప్రాయంలోనే కేంద్ర ఆరోగ్య శాఖలోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందన్న విషయంతో పాటు..కొవిన్ యాప్ కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఇంతకూ ఆమె ఎక్కడి వారు? కొవిన్ యాప్ కు ఆ పేరు ను ఎలా డిసైడ్ చేశారు. మొదట అనుకున్నదేంటి? తర్వాత మార్పులు చేసిందేమిటి? అన్నది శ్రీదేవి మాటల్లోనే చూస్తే..

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని పాలేపల్లికి చెందిన శ్రీదేవి డిగ్రీ అయ్యాక వైద్యం మీద ఉన్న ఆసక్తితో హెచ్ సీయూలో మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కోర్సు చేశారు.2019లో క్యాంపస్ సెలక్షన్ లో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో భాగమైన నేషనల్ సిస్టమ్స్ రీసోర్స్ సెంటర్ లో ఫెలోగా ఎంపికయ్యారు. అక్కడ ఆమె పని తీరు బాగుండటంతో ఆమెను కొవిడ్ -19 వ్యాక్సిన్ సెల్ లో కన్సెల్టెంట్ గా పని చేసేలా నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల ప్రాయంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖలో పని చేసే ఛాన్సును సొంతం చేసుకున్న ఆమె.. నిరంతరం కష్టపడ్డారు.

దేశ వ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం తెలిసిందే. దీని కోసం రాత్రి పదకొండు గంటల వరకు ఆఫీసులోనే ఉండి వ్యాక్సిన్ సరఫరా..ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇవ్వటం మీద ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ లలో పాల్గొన్నారు. వ్యాక్సిన్ సరఫరాకు ముందు లవ్ అగర్వాల్ నిర్వహించిన 1075 కాల్ సెంటర్ సిబ్బందికి ఇచ్చే ట్రైనింగ్ ను పర్యవేక్షించటంతో పాటు..కొవిడ్ యాప్ తయారీకి అవసరమైన సలహాలు.. సూచనలు అందించే ప్రతి మీటింగ్ లోనూ ఆమె పాల్గొన్నారు.

తొలుత కొవిడ్ అంటే వ్యాక్సిన్ ఇంటిలిజెన్స్ నెట్ వర్క్ గా అనుకున్నామని.. ఆ తర్వాత జరిగిన ఒక సమావేశంలో అడిషనల్ సెక్రటరీ వందన గుర్నానీ సరికొత్తగా ఆలోచించి కొ-విన్ ను కొవిడ్ మీద విజయం సాధించే అర్థం వచ్చేలా మార్చటంలో ‘‘కొ-విన్’’గా మారిందని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే..చివర్లో ట్విస్టు ఏమంటే.. ఆమె తాను చేస్తున్న జాబ్ కు రిజైన్ చేసింది. ఇంత చిన్న వయసులో అంత చక్కటి ఛాన్సును మిస్ చేసుకోవటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఆమె ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆమె ఇప్పుడు సివిల్స్ ను టార్గెట్ చేసుకున్నారు. దాన్ని క్రాక్ చేయటంలో నిమగ్నమై ఉన్నారు. దాన్ని సాధించాలని.. మంచిస్థానానికి చేరుకోవాలని ఆశిద్దాం.


Tags:    

Similar News