భారత జెండాతో రోదసిలోకి వెళ్లొచ్చిన తెలుగమ్మాయి.. 90 నిమిషాల ప్రయాణం !

Update: 2021-07-12 08:30 GMT
అంతరిక్షంలో చరిత్ర సృష్టించారు తెలుగు తేజం శిరీష. తొలిసారిగా స్పేస్‌ టూరిజానికి వెళ్లి వచ్చారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బండ్ల శిరీష రోదసీపై కాలు మోపారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న భారతీయ వనితగా రికార్డ్‌ సృష్టించారు. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ హోదాలో శిరీష ఈ స్పేస్ వాక్ చేశారు. అంతరిక్ష యాత్రకు వెళ్లిన నాలుగో ఇండియన్‌ గా చరిత్ర సృష్టించారు. తన భుజాన త్రివర్ణ పతాక రంగులోని బ్యాడ్జ్ ధరించి గగనాన భారతీయతను సగర్వంగా చాటిన మహిళగా రికార్డు సాధించారు. పెద్దయిన తరువాత వ్యోమగామిగా అంతరిక్షంలోకి దూసుకుపోవాలి అనేది శిరీషా చిన్ననాటి కల. నాసాలో వ్యోమగామి కావాలనేది జీవిత లక్ష్యం.

అయితే, శిరీషా కంటిచూపు సరిగ్గా లేకపోవటంతో ఆ అవకాశం రాలేదు. అయితేనేం, శిరీష ఎక్కడా నిరాశకు గురి కాలేదు. తన లక్ష్యాన్ని వీడలేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా అంతరిక్ష యాత్ర చేసారు. గుంటూరు జిల్లా తెనాలి లో జన్మించిన శిరీషా నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌ లో స్థిరపడ్డారు. పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఆమె ఏరోనాటికల్‌-ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌ లో బ్యాచిలర్‌ డిగ్రీ సాధించారు. జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి నాసాలో వ్యోమగామి కావాలనే కోరకికు తన కంటి చూప అడ్డుగా మారింది. కటం చూపు అవసరమైన స్థాయిలో లేదని తేలటంతో నిరాశకు గురయ్యారు. ఆ తరువాత కమర్షియల్‌ స్పేస్‌ ఫ్లైట్‌ల రంగంలో అవకాశాల గురించి తెలుసుకొని వర్జిన్‌ గెలాక్టిక్‌ లో చేరారు.

ప్రస్తుతం అందులో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శిరీషా ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ-22'లో దూసుకెళ్లి.. తన అంతరిక్ష విహార కలను సాకారం చేసుకున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌, మరో నలుగురితో కలిసి ఆదివారంనాడు ఆమె అంతరిక్షంలోకి దూసుకుపోయారు. ఈ చరిత్రాత్మకయానం భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8 గంటలకు ప్రారంభమైంది. నిజానికి ఈ రోదసియానం సాయంత్రం 6.30కి మొదలు కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఇది మొదలైంది. ఈ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌ కు చెందిన మానవ సహిత వ్యోమ నౌక వీఎస్ ఎస్ యూనిటీ-22లో రోదసిలోకి వెళ్లారు.
వర్జిన్ గెలాక్టిక్ యజమాని, బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్‌ తో పాటు బండ్ల శిరీష, మరో నలుగురు ఈ రోదసియానం చేశారు. వర్జిన్ గెలాక్సీ ఈ ఈవెంట్‌ను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేసింది.నేల నుంచి దాదాపు 88 కి.మీ. ఎత్తుకు చేరుకున్నాక, నాలుగైదు నిమిషాలపాటు వ్యోమగాములు భారరహిత స్థితికి లోనయ్యారు. ఆ సమయంలో యూనిటీ-22 కిటికీల గుండా బయట పరిస్థితులను వారు వీక్షించారు. జీవితాంతం గుర్తుపెట్టుకోగలిగే తీపి అనుభూతులను ఈ యాత్రను తనకు ఇచ్చిందని రిచర్డ్ బ్రాన్సన్‌ చెప్పారు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బండ్ల పుల్లయ్య మునిమనుమరాలైన శిరీష తాతయ్య రాపర్ల వెంకటనరసయ్య, అమ్మమ్మ రమాదేవి తెనాలి బోసురోడ్డులోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారు. చిన్ననాటి కలను నెరవేర్చుకుని రోదసీలోకి వెళ్లిన తమ మనుమరాలు శిరీష క్షేమంగా తిరిగి వచ్చినందుకు వెంకటనరసయ్య, రమాదేవి ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ గవర్నర్ తో పాటుగా ముఖ్యమంత్రి జగన్..ప్రతిపక్ష నేత చంద్రాబు సైతం శిరీషాను అభినందించారు.  సోషల్ మీడియా ద్వారా ఆమెకి అందరూ విషెష్ తెలియజేస్తున్నారు.
Tags:    

Similar News