లోక్ స‌భ‌కు తెలుగు న‌టులు ఎన్నిక‌య్యారు!

Update: 2019-05-26 05:20 GMT
వారంతా వెండితెర మీద మెరిసిన వారే. మ‌రి.. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో న‌టులుగా సుప‌రిచితులు. అలాంటి వారు తాజాగా జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గెలుపొంది ఎంపీల‌య్యారు. త‌మ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన వారు.. వేర్వేరు రాష్ట్రాల్లో త‌మ స‌త్తాను ప్ర‌ద‌ర్శించారు. తొలిసారి తెలుగు సినిమాలో న‌టించిన ముగ్గురు న‌టులు ఒకే ఎన్నిక‌ల్లో లోక్ స‌భ‌కు ఎన్నిక కావ‌టం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే..ఈ ముగ్గురు వేర్వేరు రాష్ట్రాల్లో పోటీ చేసి విజ‌యం సాధించ‌టం.

ఇంత‌కీ ఆ ముగ్గురు ఎవ‌రంటే ప్ర‌ముఖ సినీ న‌టి సుమ‌ల‌త‌.. న‌టి న‌వ‌నీత్ కౌర్.. ప్ర‌తిక‌థానాయ‌కుడి పాత్ర‌ల్ని పోషించే ర‌వికిష‌న్.  సీనియ‌ర్ న‌టి సుమ‌ల‌త‌ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. శ్రుతిల‌య‌లు.. ఖైదీ.. గ్యాంగ్ లీడ‌ర్ లాంటి ఎన్నో స‌క్సెస్ ఫుల్ చిత్రాల్లో న‌టించిన ఆమె తాజాగా జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. భ‌ర్త అంబ‌రీశ్ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆమె రాజ‌కీయ రంగ ప్ర‌వేశం అనివార్య‌మైంది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ పై పోటీ చేసిన ఆమె.. తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. అంతిమంగా విజ‌యం సాధించారు.

ఇదిలా ఉంటే.. మ‌రో న‌టి న‌వ‌నీత్ కౌర్ ఎంపీగా ఎన్నిక‌య్యారు. ప‌లు సినిమాల్లో న‌టించినా స‌రైన బ్రేక్ రాని ఆమె య‌మ‌దొంగ‌.. శ్రీ‌ను వాసంతి ల‌క్ష్మీ.. మ‌హార‌థితో స‌హా ప‌లు సినిమాల్లో న‌టించారు. తాజాగా ఆమె మ‌హారాష్ట్రలోని అమ‌రావ‌తి లోక్ స‌భ స్థానం నుంచి యువ స్వాభిమానీ ప‌క్ష త‌ర‌ఫున పోటీ చేసి శివ‌సేన అభ్య‌ర్థిని ఓడించి లోక్ స‌భ‌లో అడుగుపెట్ట‌నున్నారు. తెలుగుసినిమాలో ఆమె జోరుపెద్ద‌గా సాగ‌ని నేప‌థ్యంలో ఆమె మ‌హారాష్ట్ర ఎమ్మెల్యే ర‌వి రాణాను పెళ్లి చేసుకున్నారు. భ‌ర్త అడుగుజాడ‌ల్లో న‌డిచిన ఆమె.. తాజాగా పాలిటిక్స్ లోకి జాయిన్ అయి.. ఎంపీగా ఎన్నిక‌య్యారు.

తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులైన మ‌రో న‌టుడు ర‌వికిష‌న్. పేరు చెప్పినంత‌నే గుర్తుకు రాక‌పోవ‌చ్చు కానీ.. రేసుగుర్రం చిత్రంలో విల‌న్ అన్నంత‌నే చ‌ప్పున గుర్తుకు వ‌చ్చారు. ఆయ‌న యూపీలోని కీల‌క‌మైన గోర‌ఖ్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. తెలుగు.. భోజ్ పురి చిత్రాల్లో ప్ర‌ముఖుడైన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. తాజాగా యూపీ సీఎం యోగి స‌హ‌కారంతో టికెట్ సాధించిన ఆయ‌న‌..ఎంపీగా భారీ మెజార్టీతో (3ల‌క్ష‌ల పైచిలుకు) గెలుపొంద‌టం విశేషం.
Tags:    

Similar News