తెలుగు బీజేపీ నేతల్లో ఎవరికి మంత్రి పదవులు..ఎవరికి గవర్నరు పదవులు?

Update: 2019-05-29 17:41 GMT
కేంద్రంలో మంత్రి పదవులు ఎవరెవరికి వస్తాయి.. తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు ఎంపీల్లో ఎవరికైనా అవకాశం ఉందా.. లేదంటే - ఏపీ - తెలంగాణకు చెందిన నేతల్లో ఎంపీలుగా లేని వారిలోనూ ఎవరికైనా మంత్రి పదవి కల్పించి తరువాత రాజ్యసభకు పంపించే అవకాశం ఉందా అన్న కోణంలో రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు మోదీ పాత కేబినెట్లోని కొందరికి ఈసారి బెర్తులు దక్కే అవకాశం లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం ఇద్దరికి మంత్రి పదవులు దొరుకుతాయన్న ఆశలో ఉన్నారు నేతలు.

అయితే, ఇదే సమయంలో ఇంకో వాదనా వినిపిస్తోంది. బీజేపీకి గతం కంటే సీట్లు పెరగడం.. కొత్తగా పశ్చిమ బెంగాల్ - కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారీగా సీట్లు రావడంతో అక్కడా కనీసం ఇద్దరు చొప్పున నేతలకు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఇటు ఒడిశాలోనూ 8 సీట్లు సాధించడంతో ధర్మేంద్ర ప్రధాన్‌ తో పాటు మరొకరికి కూడా మంత్రి పదవి ఇచ్చి తద్వారా అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. గతంలో బీజేడీలో కీలకంగా ఉండి ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఓటమి పాలైన జై పండాకు మంత్రి పదవి ఇచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని సమాచారం. అదే సమయంలో బండారు దత్తాత్రేయను ఏదైనా రాష్ట్రానికి గవర్నరుగా పంపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీ గెలుచుకోలేదు. లోక్ సభకు పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. ఆయన్ను అలాగే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారని తెలుస్తోంది. అలాంటప్పుడు ఇతర నేతలకు ఈ రాష్ట్రం నుంచి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని టాక్.

కానీ, ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్‌ లో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎంపీ.. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రీకాకుళంలో పోటీ చేసి ఓటమి పాలైన కణిత విశ్వనాథాన్ని ఒడిశాకు గవర్నరుగా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మంత్రి పదవులో.. గవర్నరు పదవులో ఏదో ఒకటి తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలకు దక్కొచ్చని తెలుస్తోంది.


Tags:    

Similar News