భారత అంతరిక్ష రంగంలో తెలుగు కుర్రాళ్ల సత్తా!

Update: 2022-11-15 10:37 GMT
అంతరిక్ష రంగంలో భారత్‌.. అమెరికా, రష్యా వంటి దేశాలకు తీసిపోసి రీతిలో ఘనవిజయాలు సాధించింది. వేరే దేశాల సహకారం లేకుండానే ఈ రంగంలో స్వయంసమృద్ధిని సాధించింది. సొంతంగా ఉపగ్రహాలు, రాకెట్ల తయారీతో భారత్‌ గగనవీధిలో తన ఘనతను చాటుకుంటోంది.

ఈ పరంపరలో దేశ చరిత్రలోనే తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లేందుకు విక్రమ్‌-ఎస్‌ పేరుతో ఓ ప్రైవేట్‌ రాకెట్‌ సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువ శాస్త్రవేత్తలు విక్రమ్‌-ఎస్‌నున రూపొందించడం విశేషం. వీరు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే.. భవిష్యత్‌లో అంతరిక్ష యానం మరింత సులభతరం కానుందని అంటున్నారు. నవంబర్‌ 18న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రైవేట్‌ రాకెట్‌ను ప్రయోగిస్తారు.  

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో స్కైరూట్‌ ఏరో స్పేస్‌ స్టార్టప్‌ సంస్థ ఈ రాకెట్‌ను తయారు చేసింది. ఈ రాకెట్‌ను విశాఖపట్నంకు చెందిన నాగభరత్‌ (33), హైదరాబాద్‌కు చెందిన చందన్‌ పవన్‌ కుమార్‌ రూపొందించారు. వీరిద్దరూ కలసి స్కైరూట్‌ ఏరోస్పేస్‌ పేరిట స్టార్టప్‌ సంస్థను ఏర్పాటు చేశారు.

విశాఖకు చెందిన నాగభరత్‌ ప్రఖ్యాత రిషివ్యాలీ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఇంటర్‌ తర్వాత ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. 2012 అక్టోబర్‌ నుంచి 2015 మే వరకూ ఇస్రోకు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగం చేశారు.

ఆ తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2018 ఆగస్ట్‌లో తన తోటి శాస్త్రవేత్త, హైదరాబాద్‌కు చెందిన పవన్‌కుమార్‌ చందనతో కలిసి స్కైరూట్‌ ఏరో స్పేస్‌ అనే స్టార్టప్‌ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా చిన్న చిన్న రాకెట్స్‌ను తయారు చేస్తూ వాటిపై పరిశోధనలను వేగవంతం చేశారు.

ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లను పంపించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు మాత్రమే అనుమతులు ఉండేవి. అయితే, రెండేళ్ల క్రితం ఈ నిబంధనలను సడలించారు. ప్రవేటు సంస్థలకు కూడా అవకాశం కల్పించారు. దీంతో ఇక అప్పటి నుంచి నాగభరత్, పవన్‌కుమార్‌ కలిసి అంతరిక్షంలోకి అడుగుపెట్టే మొదటి ప్రై వేట్‌ రాకెట్‌ తమదే కావాలన్న లక్ష్యంతో ముందుకు కదిలారు. ఈ క్రమంలో అనేక సంస్థల నుంచి పోటీ ఎదురైనా ప్రైవేటు రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ను సృష్టించారు.

భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడైన విక్రమ్‌ అంబాలాల్‌ సారాభాయ్‌కు నివాళిగా తమ తొలి ప్రై వేట్‌ రాకెట్‌కు విక్రమ్‌-ఎస్‌ (శరభి) అని నామకరణం చేశారు.

కాగా ప్రస్తుతం చేపట్టబోయే ప్రయోగం డెమాన్‌స్ట్రేషన్‌ మాత్రమేనని ఇద్దరు యువకులు చెబుతున్నారు. రాకెట్‌లో మూడు శాటిలైట్లను పంపిస్తున్నారు. విక్రమ్‌ పేరుతో మూడు రకాల రాకెట్లను తయారు చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News