సినీ పరిశ్రమా కారు వైపే...!?

Update: 2018-12-13 05:00 GMT
తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసాయి. అధికారానికి రావడమే కాదు... ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో మెజార్టీని కూడా సాధించింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ ఎన్నికల్లో ప్రచారం పెద్ద ఎత్తున జరిగినా.... ఎప్పటిలా సినీ గ్లామర్ మాత్రం కనిపించలేదు. నిజానికి సినీ పరిశ్రమ మొత్తం తెలుగుదేశం పార్టీ వైపే ఉంటుందని తెలంగాణ ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భావించారు. అయితే సినిమా సీన్ మాత్రం పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో సినీ గ్లామర్ కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. సినీ పెద్దలతో రహస్య భేటీలు కూడా నిర్వహించారని అంటున్నారు. సినీ గ్లామర్ కోసం చంద్రబాబు నాయుడు నందమూరి వంశాన్ని కూడా వాడుకోవాలని పథక రచన చేశారు. ఇందులో భాగంగా దివంగత నాయకుడు - చంద్రబాబు నాయుడి బావమరిది నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని కూకట్‌ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా రంగంలో దింపారు. నందమూరి సుహాసిని సోదరులు నందమూరి తారక రామారావు - నందమూరి కల్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని ఆశించారు. అంతే కాదు... వారిద్దరితో పాటు వారి అభిమానులు - సినీ రంగానికి చెందిన ఇతరులు కూడా వస్తారని అనుకున్నారు.

అయితే చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే.... సినీ పరిశ్రమ మరొకటి తలచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణ రాష్ట్ర సమితి తరఫునే ఉండడం మంచిదనే నిర్ణయానికి వచ్చింది తెలుగు చిత్రసీమ. తాము ఇక్కడే ఉంటామని - ఆంధ్రప్రదేశ్‌ కు చిత్రసీమ తరలి వెళ్లాలంటే మరో 30 ఏళ్లు పడుతుందని సినీ పరిశ్రమకు చెందిన వారు భావించారంటున్నారంటున్నారు. దీనిని ద్రష్టిలో ఉంచుకునే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయరాదని తెలుగు చిత్రసీమ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే చిత్ర పరిశ్ర‌మ‌ మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందినది కావడం... ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడంతో ప్రచారానికి వెళ్లడం కంటే మానుకోవడమే మేలని పరిశ్రమ పెద్దలు భావించారంటున్నారు. తాము ప్రచారం చేయకుండా మిన్నకుంటే దాని ప్రభావం తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలిస్తుందని, ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అంటే పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపకూడదని సినీ పరిశ్రమ భావించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.


Tags:    

Similar News