ఈ చిట్టి వీడియోతో తెలుగు హీరో ఎంట్రీ సీన్ తీసేయొచ్చు

Update: 2022-03-30 04:39 GMT
ప్రతిభకు కొదవ ఉండదు మన దేశంలో. బ్యాడ్ లక్ ఏమంటే.. అలాంటి వారికి సరైన గుర్తింపు దక్కదు. ఒకవేళ పొరపాటున ఎవరికైనా అవకాశం లభించినప్పటికి అదందరికి తెలిసేసరికి రాజకీయం ఎంట్రీ ఇచ్చి.. వారిని కిందకు తొక్కేస్తుంది. అందుకే.. మారుమూల ప్రాంతాల్లో కనిపించే మాణిక్యాలు మట్టి కొట్టుకుపోవటమే తప్పించి.. వెలుగులోకి రావటం మాత్రం కనిపించదు. కానీ.. అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రపంచంలోని ఏ మూలన ఉన్న ప్రతిభ అయినా.. ప్రాంతాలకు అతీతంగా అందరికి పరిచయమయ్యే పరిస్థితి ఇప్పుడుంది.

తాజాగా ఇరవై ఒక్క సెకన్ల నిడివి ఉన్న ఒక చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు విస్మయానికి గురి కాకుండా ఉండలేని పరిస్థితి. మన దేశంలో టాలెంట్ కు  కొదవ లేదన్న విషయాన్ని మరోసారి గుర్తుకు చేసేలా ఈ వీడియో ఉంది. మలుపులు తిరిగిన సన్నని రోడ్డులో.. తల మీద పెద్ద దుస్తుల మూటను పెట్టుకొని రెండు చేతులతో దాన్ని పట్టుకొని.. స్పీడ్ గా సైకిల్ తొక్కుతున్న వ్యక్తి టాలెంట్ కు ఆశ్చర్యపోకుండా ఉండలేం.

సైకిల్ తొక్కే వ్యక్తి వెనుకున వెళుతున్న కారులోని వ్యక్తి వీడియో తీయటంతో.. అతడి టాలెంట్ వెలుగులోకి రావటమే కాదు.. ఈ వీడియోను చూస్తున్న వారంతా అబ్బురపడిపోతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రతిభ ప్రదర్శించే వారు కనిపించినంతనే వారికి వివరాల్ని ప్రపంచానికి తెలియజేయటంలో ముందుండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. సర్కస్ ఫీట్ కు ఏ మాత్రం తీసిపోని ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

సదరు వ్యక్తి మీద ప్రశంసల వర్షం కురిపించారు. తనపై భారీ మూటను పెట్టుకొని హ్యాండిల్ పట్టుకోకుండా.. వంపులు తిరిగి ఉన్న రోడ్డు మీద అంత వేగంగా తొక్కుకుంటూ వెళుతున్న అతడి నైపుణ్యాన్ని మెచ్చుకున్న ఆయన.. "ఈ వ్యక్తి దేహంలో జైరోస్కోప్ ఉందా? అతను మానవ సెగ్వే. సైకిల్ ను అతడు కంట్రోల్ చేస్తున్న వైనం అద్భుతం. నాకు బాధ కలిగించే విషయం ఏమంటే.. మన దేశంలో ఇలాంటి చాలామంది ప్రతిభావంతులైన జిమ్నాస్ట్ లు.. క్రీడాకారులు ఉన్నారు. వారికి సరైన గుర్తింపు.. శిక్షణ లభించటం లేదు" అంటూ తన అభిప్రాయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్పేశారు.

ఈ వ్యక్తి టాలెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. వీడియోను చూసినంతనే తమకు నచ్చిన వారికి షేర్ చేస్తున్నారు. ఏమైనా.. ఈ వీడియోను మన టాలీవుడ్ దర్శకులు చూస్తే మాత్రం.. మన హీరోల ఎంట్రీ సీన్ కు యథాతధంగా వాడేయటం ఖాయమని చెప్పకతప్పదు.



Full ViewFull View
Tags:    

Similar News