‘హోదా’ తెలుగు మీడియాకూ వద్దా?

Update: 2017-01-24 09:53 GMT
మీడియా ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంది? రకరకాల ట్యాగ్ లైన్లతో ఉదరగొట్టేసే తెలుగు మీడియాకు తెలుగు ప్రజల సంక్షేమం అవసరం లేదా? కోట్లాది మంది ఆంధ్రుల ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా నిలవాల్సిన మీడియా సంస్థలు.. పాలకుల తొత్తులుగా మారిపోయారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. విభజన సమయంలో ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ హోదా గురించి అప్పట్లో మీడియా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యింది.

హోదా వస్తే.. ఏపీకి అన్ని మంచిరోజులే అంది. ఇదే మాటను ఏపీ అధికారపక్ష అధినేత నోటి నుంచి కూడా వచ్చింది. అప్పటి వరకూ అవే మాటల్ని చెప్పిన తెలుగు మీడియా.. పాలకుల నోటి మాట మారిన తర్వాత నుంచి తన పల్లవిని మార్చేసింది. ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా తమదైన ఎజెండాను అమలు చేస్తున్న అధికారపక్షానికి తగ్గట్లే మీడియా తన తీరును మార్చుకోవటం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది.

జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీం ఆదేశాలపై తమిళ సమాజమే కాదు.. మీడియా కూడా స్పందించింది. అక్కడి ప్రభుత్వాలు.. ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. తమిళుల గొంతు ఒక్కటేనని తేల్చేసింది. అలాంటిదేదీ ఆంధ్రాలో కనిపించని పరిస్థితి. ఓపక్క విశాఖలో ఏపీ హోదా మీద నిర్వహించాలనుకుంటున్న మౌనదీక్షకు ఆన్ లైన్లో విశేష ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఆంధ్రులే కాదు తెలుగు వారు సైతం ప్రోత్సహిస్తున్నారు. తమ మద్దతు కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి వేళ.. జనాల భావోద్వేగాలకు అనుగుణంగా రియాక్ట్ కావాల్సిన తెలుగు మీడియా.. ఆర్కే బీచ్ మౌనదీక్షను ఎక్కడో చిన్నగా.. కనిపించి కనిపించనట్లుగా వేసేసి.. దానికి పోలీసుల అనుమతి లేదన్న విషయాన్ని హైలెట్ చేసేస్తున్న తీరు చూస్తే.. ఆంధ్రుల ఆకాంక్ష పాలకులకే కాదు.. ‘తెలుగు మీడియా’కు కూడా ఇష్టం లేదా? అన్నది ప్రశ్నగా మారింది. హోదా కోసం పోరాటం వద్దని చెప్పేసిన బాబు మాటల్ని.. కేంద్రంపై పోరాటమా? అంటూ ఏపీ సీఎం చెప్పేసిన మాటలకు ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున అచ్చేస్తున్న వార్తల్ని ఆంధ్రోళ్లే కాదు.. యావత్ తెలుగుజాతి గుర్తింస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయినా.. ప్రజలకు రక్షగా ఉండటం మానేసి.. పాలకుల అడుగులకు మడుగులు వత్తటమేనా తెలుగు మీడియా ధర్మమన్న విమర్శకు సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుందని చెప్పక తప్పదు.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News