లంకేయుల ఆకలి తీర్చనున్న తెలుగు బియ్యం

Update: 2022-04-06 01:15 GMT
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిట్టి దేశం శ్రీలంక. ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్న ఆ దేశాన్ని ఆదుకోవటానికి.. వారి ఆకలిని తీర్చటానికి ముందుకు వచ్చింది భారత్. శ్రీలంక అభ్యర్థనతో ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన సాయాన్ని అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి జరిగిన ఒప్పందాల్లో భాగంగా శ్రీలంకకు పెద్ద ఎత్తున బియ్యాన్ని పంపాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా కాకినాడ.. విశాఖపట్నం.. చెన్నై.. ట్యూటికోరిన్ తదితర పోర్టుల నుంచి బియ్యాన్ని పంపాలని నిర్ణయించారు. మొదటగా కాకినాడ పోర్టు నుంచి 2వేల మెట్రిక్ టన్నుల బియ్యం కార్గో శ్రీలంకకు బయలుదేరింది. అదే రీతిలో చెన్నై.. విశాఖపట్నం పోర్టుల నుంచి పంపనున్నారు. లంకేయుల ఆకలి కేకల్ని తీర్చేందుకు తెలుగు రాష్ట్రాల బియ్యమే కీలకం కానుంది.

మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని శ్రీలంకకు పంపనున్నారు. ఈ భారీ స్టాక్ ను తెలుగు రాష్ట్రాల నుంచే పంపటం గమనార్హం. ఇక.. తెలంగాణలో పండించిన బియ్యాన్ని చెన్నై పోర్టు ద్వారా తరలించనున్నారు. ఏమైనా ఒక దేశం ఆకలి కేకల్ని తీర్చటంలో తెలుగు రాష్ట్రాల బియ్యం సాయంగా నిలవటం తెలుగు వారికి సంతోషాన్ని కలిగించక మానదు.

ఇదిలా ఉంటే.. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అందులో ముఖ్యమైనది వెనుకా ముందు చూసుకోకుండా చేపట్టిన ఉచిత తాయిలాలు. ఓవైపు పన్నులు రద్దు చేయటం.. మరోవైపు ఉచిత సంక్షేమ పథకాల్ని అమలు చేయటం.. ప్రభుత్వానికి ఆదాయం లేని వేళ..అప్పులు తీసుకోవటం.. వాటిని చెల్లించకనే మళ్లీ అప్పులు చేయటం లాంటివి చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా దెబ్బకు ఆ దేశానికి ప్రధాన ఆదాయవనరు అయిన పర్యాటకం దారుణంగా దెబ్బతినటంతో మొదలైన ఆర్థిక సమస్యలు.. దేశ వ్యవసాయ రంగంలో రసాయనాల వినియోగాన్ని ఆపేసి.. ఆ స్థానంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మాత్రమే చేయాలంటూ పెట్టిన కండీషన్ కు ఆహార ధాన్యాల దిగుబడులు దారుణంగా దెబ్బ తినటంతో ఇప్పుడు ఆహార సమస్య ఆ దేశంలో తీవ్రంగా ఉంది.

అప్పులు తీసుకోవటానికి సాధారణంగా అతి తక్కువ వడ్డీలతో ఉండే జపాన్.. ప్రపంచ బ్యాంక్ లాంటి వాటి నుంచి కాకుండా ప్రైవేటు బ్యాంకుల వద్ద నుంచి అధిక వడ్డీకి తీసుకోవటం కూడా ఆ దేశాన్ని దారుణ పరిస్థితుల్లో పడేసేలా చేసిందని చెప్పాలి. పాలకుల అసమర్థ నిర్ణయాలు ఈ రోజున లంకేయులు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News