సెఫాల‌జిస్ట్ ల మాదిరే తెలుగు ఛాన‌ళ్లు..!

Update: 2019-05-20 04:15 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన ఏడు ద‌శ‌ల పోలింగ్ ముగిశాయి. పోలింగ్ ముగిసిందో లేదో.. లెక్క‌లు క‌ట్టి..లిస్ట్ లు రెఢీ చేసుకున్న సెఫాల‌జిస్ట్ లు.. ఛాన‌ళ్లు అదే ప‌నిగా ఎగ్జిట్ పోల్స్ ను విడుద‌ల చేశాయి. గ‌తంలో ఎగ్జిట్ పోల్స్ అంటే మ‌హా అయితే.. ఐదు లేదంటే ప‌ది. అంత‌కు మించి క‌నిపించేవి కావు.

కానీ.. మారిన ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు భారీ ఎత్తున ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల‌య్యాయి. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా మీడియా సంస్థ‌లు మొద‌లుకొని.. స్వ‌తంత్య్ర సంస్థ‌లు కొన్ని త‌మ‌కు తాముగా ఎగ్జిట్ పోల్స్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లుగా పేర్కొంటూ ప్రెస్ మీట్ లు పెట్టేశారు. తాజాగా విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ తో మ‌రింత క‌న్ఫ్యూజ‌న్ పెరిగిన ప‌రిస్థితి.

కాకుంటే.. కేంద్రంలో మోడీ స‌ర్కార్.. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ఖాయ‌మ‌న్న అంశంపై పెద్ద ఎత్తున విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డిస్తున్నాయి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఏ ఇద్ద‌రు సెఫాల‌జిస్ట్ లు ఒక్క‌టి కాన‌ట్లు.. ఏ రెండు ఛాన‌ళ్లు ఒకే తీరులో రియాక్ట్ కాక‌పోవ‌టం క‌నిపించింది. తాజాగా విడుద‌లైన ఎగ్జిట్ పోల్స్ చూస్తే.. రెండు వ‌ర్గాలుగా చీలిపోయి.. కొంద‌రు కొన్ని పార్టీల‌కు అనుకూలంగా త‌మ ఎగ్జిట్ పోల్స్ ను విడుద‌ల చేస్తే.. మ‌రికొంద‌రు అందుకు భిన్న‌మైన పార్టీలు గెలుస్తాయ‌న్న మాట‌ను చెప్ప‌టం క‌నిపిస్తుంది.

ఏపీ వ‌ర‌కు వ‌స్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్లోకి రావ‌టం ఖాయ‌మంటూ అత్య‌ధికులు త‌మ ఫలితాల్ని వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు మాత్రం టీడీపీకి గెలుపు అవ‌కాశాలు ఉన్నాయంటూ బ‌లమైన వాద‌న‌ల్ని వినిపిస్తున్నారు.  ఈ సెఫాల‌జిస్ట్ లకు త‌గ్గ‌ట్లే.. తెలుగు ఛాన‌ళ్లు సిత్రంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని చెప్పాలి.

ఏ ఛాన‌ల్ కు ఆ ఛాన‌ల్ త‌మ స్టాండ్ కు త‌గ్గ ఎగ్జిట్ పోల్స్ ను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తూ ప్ర‌చారం చేయ‌టం క‌నిపించింది. త‌మ స్టాండ్ కు భిన్న‌మైన ఎగ్జిట్ పోల్స్ ను మాట వ‌ర‌స‌కు చూపించ‌కుండా ఉన్న తీరు చూస్తే.. సెఫాల‌జిస్ట్ ల మాదిరే ఛాన‌ళ్ల తీరు ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  
Tags:    

Similar News