చ‌లిపులి దెబ్బ‌కు 120 ఏళ్ల రికార్డ్ మ‌టాష్‌

Update: 2017-12-20 06:49 GMT
అరుదైన రికార్డు ఒక‌టి బ‌ద్ధ‌లైంది. 120 ఏళ్ల నాడు వ‌ణుకు పుట్టించిన చ‌లిని మించిన చ‌లితో జ‌నాల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. చ‌లి పులి దెబ్బ‌కు తెలంగాణ ప్రాంతం వ‌ణుకుతోంది. తెలంగాణ‌తో పోలిస్తే.. సీమాంధ్ర‌లోని కొన్నిచోట్ల మాత్ర‌మే తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలో ఎప్పుడూ లేనంత అతి త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు తాజాగా న‌మోద‌వుతున్నాయి.  మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున అదిలాబాద్‌ లో అత్య‌ల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌.. మెద‌క్ లో 8.. భ‌ద్రాచ‌లం.. రామ‌గుండంలో 12 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైతే.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో 13 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఇక‌.. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక‌ట్రెండు డిగ్రీల ఉష్ణోగ్ర‌త త‌క్కువ‌గా ఉన్న‌ట్లుగా వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు చెబుతున్నారు.

వాతావ‌ర‌ణ శాఖ అధికారుల వ‌ద్ద ఉన్న రికార్డుల ప్ర‌కారం తెలంగాణ అతి త‌క్కువ ఉష్ణోగ్ర‌త 1897 డిసెంబ‌రు 17న అత్య‌ల్పంగా 4.4 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు కాగా.. ఆ త‌ర్వాత 2014 డిసెంబ‌రు 20న 3.9 డిగ్రీల అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. మంగ‌ళ‌వారం ఈ రికార్డుల‌న్నీ బ‌ద్ధ‌ల‌య్యాయి.

ఇలాంటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు కార‌ణం ఏమిట‌న్న‌ది చూస్తే.. ఉత్త‌ర భార‌తం నుంచి వీస్తున్న శీత‌ల గాలుల కార‌ణంగా రాత్రివేళ ఉష్ణోగ్ర‌త‌లు బాగా ప‌డిపోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ రోజు.. రేపు రెండు రోజులు మ‌రింత‌గా ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇక‌.. సీమాంధ్ర విష‌యానికి వ‌స్తే తెలంగాణ‌తో పోలిస్తే చ‌లి త‌క్కువ‌గా ఉంది. ఒక్క విశాఖ ఏజెన్సీ ప్రాంత‌మైన లంబ‌సింగిలో మాత్ర‌మే చ‌లి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. మంగ‌ళ‌వారం ఉద‌యం అక్క‌డ మూడు డిగ్రీల అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఇది మిన‌హాయిస్తే.. చాలా ప్రాంతాల్లో చ‌లి తీవ్రత అంత‌గా క‌నిపించ‌టం లేదు. ఇక‌.. చ‌లి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో  పిల్ల‌లు.. వృద్ధులు మ‌రింత జాగ్ర‌త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. గాయాల‌తో ఉన్న వారు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
Tags:    

Similar News