ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్న పదేళ్ల అమ్మాయి.. ప్రపంచ నేతల్లారా తలదించుకోండి

Update: 2021-05-19 03:32 GMT
కారణం ఏమైనా కావొచ్చు. గొడవ ఎంత పెద్దదైనా కావొచ్చు. కానీ.. ఆధునిక కాలంలో హింస ఏమిటి? ఉత్త పుణ్యానికి ప్రాణాలు పోవటం ఏమిటి? విలువైన ఆస్తి నష్టం జరగటం ఏమిటి? నవ్వులతో నిండాల్సిన బాల్యం.. భయంతో వణకటం ఏమిటి? ఇంత నాగరికత సాధించామని చంకలు గుద్దుకుంటున్నా.. బతుకు భయంతో విలవిలలాడే దయనీయ పరిస్థితి ఏమిటి? ఏ క్షణంలో ఏ మూల నుంచి ఏ బాంబు పడుతుందో.. అదెవరినీ తనతో తీసుకెళుతుందో? అర్థం కాని అయోమయ స్థితిలో ఉండటం దేనికి నిదర్శనం?

పాలస్తీనా.. ఇజ్రాయల్ మధ్య సవాలచ్చ గొడవలు ఉండొచ్చు. ఒకరు మరొకరిపై బాంబుల వర్షం కురిపించొచ్చు. కానీ.. అక్కడ మానవత్వం ఓడిపోతోంది. బాల్యం భయంతో విలవిలలాడుతోంది. దేశాల మధ్య రచ్చకు అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి పరిణామాన్ని ఇంత పెద్ద ప్రపంచం.. ప్రపంచ దేశాలు చేష్టలుడిగినట్లుగా చూస్తుండిపోవటమే కాదు.. ఇది సరికాదన్న మాట రాని పరిస్థితి. ఇలాంటి దయనీయ స్థితిని..దరిద్రపుగొట్టు పరిస్థితిని పదేళ్ల పాలస్తీనా బాలిక ప్రశ్నిస్తోంది.

దీన్ని నేనెలా ఆపగలను? నాకింకా పదేళ్లే.. ఎప్పుడేం జరుగుతుందో భయంగా ఉంటోందని మీడియా ప్రతినిధి ఒకరికి నదీన్ అబ్దెల్ తయూఫ్ అనే పాలస్తీనా బాలిక సంధించిన ప్రశ్న.. ఈ రోజున ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోంది. గాజాపై ఇజ్రాయల్ జరిపిన ప్రతీకార దాడుల్లో నదీన్ కుటుంబం తృటిలో తప్పించుకుంది. ఇవాల్టికి ఆమె బాగానే ఉండొచ్చు. రేపటి సంగతి ఏమిటి? అన్నది ప్రశ్న.

మిడిల్ ఈస్ట్ ఐ అనే మీడియా సంస్థ ప్రతినిధి గాజాలోని శిథిలాల పక్కనే షాక్ లో ఉన్న నదీన్ ను పలుకరించాడు. అమితమైన దు:ఖంలో ఉన్న ఆమె తన ఆవేదనను బయటపెట్టింది. ‘ఎప్పుడూ నాకేదో జరగబోతున్నట్లే ఉంటుంది. ఎందుకో తెలీదు. ఇదంతా చూడండి.. ఎలా కుప్పకూలి ఉందో. నేనేమీ చేయలేకపోతున్నాను. పోనీ.. నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారో చెప్పండి. ఈ సమస్యను పరిష్కరించాలనా? పదేళ్ల పిల్లను. నేను తట్టుకోలేకపోతున్నా. నాకు డాక్టర్ కావాలని ఉంది. లేదా ఇంకేదైనా. నా ప్రజలకు సహాయం చేయాలి ఉంది. ఇలా ఉంటే చేయగలనా? భయమేస్తోంది. మరీ ఎక్కువగా కాదు. నా ప్రజల కోసం ఏదైనా చేయగలను. కానీ ఏం చేయాలి? ఇలా భవనాలు నిలువునా కూలి ఉండటం చూసి రోజూ ఏడుస్తున్నా. ఇలా జరగటం అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది. ఏమిటీ కర్మ? ఇవన్నీ లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి? మేమంటే వాళ్లకు ఇష్టం లేదట. నా చుట్టు ఉన్న ఈ పిల్లల్ని చూడండి. అంతా పసివారు. వాళ్లపైన మిస్సైల్స్ వేసి చంపేస్తారా? ఇది సరికాదు’’ అంటూ ఆమె రోదన ప్రపంచాన్ని మెలి పెడుతోంది. ప్రపంచ నేతలంతా ఆ చిన్నారి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ యుగంలో కరోనా లాంటి ఆరాచకంతో పాటు.. కావాలని తెచ్చుకునే ఈ విషాదం అవసరమా?
Tags:    

Similar News