సర్కారు కు చిక్కు సమస్య కౌలు రైతు

Update: 2022-07-13 07:30 GMT
కౌలు రైతుల స‌మ‌స్య‌ల‌కు సంబంధించి ఏపీ స‌ర్కారు తీసుకుంటున్న ఏ చ‌ర్యలూ స‌ఫ‌లీకృతం కావ‌డం లేదు అన్న వార్త‌లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టిదాకా ల‌క్షా27 వేల కోట్ల రూపాయ‌లు సేద్యానికే కేటాయించామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

కానీ వాటి ఫ‌లితాలు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు అని విప‌క్షాలు అంటున్నాయి. ఏ విధంగా చూసుకున్నా కౌలు రైతులు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. సాగు యోగ్యతా ప‌త్రం అన్న‌ది లేక‌పోవ‌డంతో పంట బీమా కానీ పంట న‌ష్టం కానీ వారికి అంద‌డం లేదు.

కొన్ని చోట్ల గుర్తింపు కార్డులు ఇష్యూ కాక‌పోవ‌డంతో వారికి రుణ మాఫీ కూడా ద‌క్క‌డం లేదు. కొన్ని సార్లు అస‌లు యజ‌మానులు రుణ మాఫీ పొంది హాయిగా ద‌ర్జా వెల‌గ‌బెడుతున్న సంద‌ర్భాలే ఉన్నాయి.

గుంటూరులో ఓ కౌలు రైతు త‌న క‌ష్టం చెప్పుకుంటే సాగు యోగ్య‌తా ప‌త్రం లేనందున తానేం చేయ‌లేన‌ని మంత్రి అంబ‌టి చెప్పేశారు. ఇక్క‌డే కాదు అన్ని చోట్లా ఇదే స‌మ‌స్య  నెల‌కొని ఉంది. మరోవైపు రైతు ఆత్మ హ‌త్యలూ పెరుగుతున్నాయి.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లో ఇటీవ‌ల కాలంలో  కౌలు రైతులు ఎక్కువ‌య్యారు. పొలాన్ని కౌలుకు తీసుకుని ఎక‌రానికి ఇంత అని ధాన్యం రూపేణ లేదా ధ‌న రూపేణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని సాగు చేసుకునే రైతుకు మిగిలేదేమీ ఉండ‌డం లేదు. ఓ కౌలు రైతు చెబుతున్న ప్ర‌కారం రెండేళ్ల సాగుకు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల అప్పు ఉంద‌ని తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఎందరున్నారు అన్న లెక్క పై కూడా స్ప‌ష్ట‌త లేదు.

ప‌ద‌హారు ల‌క్ష‌ల మంది ఉన్నార‌ని చెబుతున్నా ఆ లెక్క‌లు కూడా త‌ప్ప‌ని తేలిపోయింది. దీంతో జ‌న‌సేన కొంత‌లో కొంత వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప‌డింది. కౌలు రైతు భ‌రోసా పేరిట ప‌వ‌న్ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం కోసం స్వ‌చ్ఛంద సంస్థ‌ల సాయంతో డేటాను సేక‌రించింది. ఇప్ప‌టిదాకా ఉన్న వివ‌రం ప్ర‌కారం రాష్ట్ర వ్యాప్తంగా 852 మంది కౌలు రైతుల కుటుంబాలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నాయ‌ని తేలుతోంది.
Tags:    

Similar News