క్రికెట్ దేవుడి ఖాతాలో ఇంకో ఊరు

Update: 2016-08-19 04:41 GMT
క్రికెట్ దేవుడిగా అందరి నీరాజనాలు అందుకునే భారతరత్న సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడు కూడా. ఆట విషయంలో ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోని ఆయన.. రాజ్యసభ సభ్యుడి హోదాలో మాత్రం ఆయన పని తీరు వేలెత్తి చూపించేలా ఉంటుంది. పార్లమెంటులో ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరిసే ఆయన తీరును చాలామంది విమర్శిస్తుంటారు. రాజ్యసభ సభ్యుడిగా సచిన్ నుంచి ఎంతో ఆశించిన వారికి అసంతృప్తే. రాజ్యసభకు హాజరు మొదలు.. ప్రశ్నలు అడగటం.. చర్చల్లో పాల్గొనటం లాంటివేమీ సచిన్ చేయరు. అంటీ ముట్టనట్లుగా వ్యవహరించే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం మరీ కష్టంగా ఉంటే వదిలేసుకోవచ్చు. కానీ.. ఆ పని మాత్రం చేయరు.

పార్లమెంటుకు హాజరులో విమర్శలు ఎదుర్కొనే సచిన్.. గ్రామాల్ని దత్తత తీసుకునే విషయంలో మాత్రం కాస్త స్పీడుగానే ఉంటారు. గతంలో ఏపీలోని నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకోవటం తెలిసిందే. పార్లమెంటు సభ్యులంతా ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలంటూ ప్రధాని మోడీ రెండేళ్ల కిందట ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగానే పుట్టంరాజు కండ్రిగ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్నారు.

తాజాగా ఈ క్రికెట్ దేవుడి కరుణ మరో గ్రామం మీద పడింది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని కరువుపీడిత గ్రామమైన డోంజాను సచిన్ దత్తత తీసుకున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డోంజా గ్రామంలో 582 కుటుంబాలు.. 2863 మంది జనాభా ఉంది. 72.1 శాతం అక్షరాస్యత ఉన్న ఈ గ్రామంపై క్రికెట్ దేవుడి కరుణతో తమ ఊరి దశ మారిపోతుందని గ్రామస్తులంతా ఆనందం చెందుతున్నారు. క్రికెట్ దేవుడి దత్తత కారణంగా తమ ఊరు ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దుతారన్న ఆశాభావాన్నిఆ ఊరి వాళ్లంతా వ్యక్తం చేస్తున్నారు. తాను తొలుత దత్తత తీసుకున్న పుట్టంరాజుకండ్రిగలో తొలి విడత పనులు పూర్తి అయ్యాక సచిన్ చూపు డోంజాపై పడనుంది. పార్లమెంటు హాజరు మాదిరి కాకుండా.. దత్తత తీసుకున్న గ్రామాల మీద క్రికెట్ మీద చూపినంత శ్రద్ధ చూపిస్తే క్రికెట్ దేవుడ్ని.. ఆ రెండు ఊర్లు తమ ప్రత్యక్ష దైవంగా కొలవటం ఖాయం.

Tags:    

Similar News