ఇక ర‌హ‌స్య‌మేముంది?... మోదీ అంతా చెప్పేశారుగా!

Update: 2019-05-05 12:00 GMT
శ‌త్రు దేశం పాకిస్థాన్ చెర‌కు చిక్కిన వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ విడుద‌ల‌కు దారి తీసిన ప‌రిణామాల‌పై అప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగినా.... అస‌లు విష‌య‌మేమిట‌న్న‌ది వెల్ల‌డి కాలేదు. ఆ త‌ర్వాత కూడా ఈ విష‌యంపై అటు అభినంద‌న్ గానీ, ఇటు న‌రేంద్ర మోదీ స‌ర్కారు గానీ నోరు విప్ప‌లేదు. ఈలోగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు రావ‌డం, ఆ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలతో పాటు మోదీ నేతృత్వంలోని బీజేపీ కూడా దిగిపోవ‌డంతో ఈ విష‌యాన్ని దాదాపుగా అంతా మ‌రిచిపోయారు. అయితే చాలా కాలం త‌ర్వాత అభినంద‌న్ మ‌ళ్లీ ఎయిర్ ఫోర్స్  విధుల్లో చేరిపోయారు. దీంతో మ‌రోమారు అభినంద‌న్ పాక్ చెర‌లో ఉన్న రోజు రాత్రి చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లేంటీ? అన్న అంశం తెర‌మీదకు వ‌చ్చింది.

నాడు పాక్ కాళ్ల బేరానికి వ‌చ్చిన వైనంపై ఏదో పెద్ద మ‌త‌ల‌బే చోటుచేసుకుని ఉంటుంద‌న్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై మాట్లాడేందుకు పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌కున్నా... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అస‌లు విష‌యాన్ని చెప్పేశారు. నాటి రాత్రి అభినంద‌న్ ను విడుద‌ల చేసేలా పాక్ ఎలా ఒప్పుకుంద‌న్న విష‌యంపై మోదీ ఫుల్ క్లారిటీ ఇచ్చార‌నే చెప్పాలి. ఈ విష‌యాల‌న్నీ ర‌హ‌స్య‌మేన‌ని, ర‌హ‌స్యాన్ని ర‌హ‌స్యంగానే ఉంచండంటూ ఓ వైపు సూచిస్తూనే... మ‌రోవైపు ప‌రోక్ష వ్యాఖ్య‌ల ద్వారా నాడు ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని స్వ‌యంగా మోదీ వెల్ల‌డించేశార‌నే చెప్పాలి. ఇంండియా టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోదీ ఈ మేర‌కు సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు.

మోదీ ఏం చెప్పార‌న్న విష‌యానికి వ‌స్తే... పాకిస్తాన్ విష‌యంలో అమెరికా, చైనా, ర‌ష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఓ విచిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్‌లో ఎవ‌రిని సంప్ర‌దించాల‌నే విష‌యంపై ఏ దేశానికి కూడా స‌రైన స్ప‌ష్ట‌త లేదు. పాక్‌లో ఎవ‌రితో మాట్లాడాలి? ప‌్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వంతోనా? లేక ఆ ప్ర‌భుత్వం నియ‌మించిన సైన్యంతోనా? ఆ సైన్యంలో భాగ‌మైన ఐఎస్ఐతోనా? అనే అస్ప‌ష్ట‌త ప్ర‌పంచ‌దేశాల‌కు ఉంద‌ని తాను భావిస్తున్నా. దీన్ని ప‌రిష్క‌రించుకోవాల్సింది ఆ దేశ‌మే*న‌ని మోదీ చాలా న‌ర్మ‌గ‌ర్భంగానే వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి నాటి రాత్రి ఏం జరిగింద‌న్న విష‌యం ఇట్టే తేలిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అభినంద‌న్‌ను విడుద‌ల చేసేలా పాక్ ను ఒప్పించేందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ దాదాపుగా రంగంలోకి దిగిపోయాయి. పాక్ కు నిత్యం అభ‌య హ‌స్తం ఇస్తున్న చైనా కూడా ఈ సారి ఆ దేశాన్ని వెన‌కేసుకొచ్చే విష‌యంపై మీన‌మేషాలు లెక్కించింది. తెల్లారేస‌రికి అభినంద‌న్ విడుద‌ల కాక‌పోతే...యుద్ధ‌మేనంటూ భార‌త్ త‌ర‌ఫున ప్ర‌పంచ దేశాల‌న్నీ పాక్ ను హెచ్చ‌రించాయట‌. దీంతో ఏం చేయాలో తోచ‌ని స్థితిలో ఇమ్రాన్ ఖాన్ స‌ర్కారు ఉంటే.... అండ‌గా నిలుస్తుంద‌నుకున్న చైనా కూడా చేతులెత్తేయ‌డంతో ఇక లాభం లేద‌నుకున్న పాక్ అభినంద‌న్ విడుద‌ల‌కు ఒప్పేసుకుంద‌ట‌. అంతేకాకుండా ఐఎస్ఐ పాకిస్థాన్ లో త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పుతున్న వైనం కూడా ఈ సంద‌ర్భంగా వెలుగు చూసింది.

అభినంద‌న్ పాక్ చేతికి చిక్క‌గానే... ఎంట్రీ ఇచ్చిన ఐఎస్ఐ ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుంద‌ట‌. భార‌త్ లోని సైనిక స్థావ‌రాల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టే విష‌యంలో చాలా ప్లానే రెడీ చేసుకుంద‌ట‌. అయితే నిమిష నిమిషానికి ప్ర‌పంచ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కార‌ణంగా ఇమ్రాన్ ఖాన్ స‌ర్కారు... ఐఎస్ఐ ప‌ట్ల కాస్తంత క‌టువుగానే వ్యవహ‌రించ‌డంతో పాటుగా అభినంద‌న్ ను విడుద‌ల చేయ‌క‌పోతే... జ‌రిగే ప‌రిణామాల‌ను వివ‌రించి మ‌రీ ఆ సంస్థ‌ను దారికి తెచ్చింద‌ట‌. సో... ఆ రాత్రి ఏం జ‌రిగింద‌న్న‌ది ర‌హ‌స్య‌మేనంటూ మోదీ చెబుతున్నా... ఆయ‌న నోట నుంచి వ‌చ్చిన ప‌రోక్ష వ్యాఖ్య‌లు... ఆ ర‌హ‌స్యాన్ని బ‌ద్ద‌లు కొట్టేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News