మోడీ మాటల ఫైర్ పారిస్ లో ఉగ్ర ఫైరింగ్

Update: 2015-11-14 04:16 GMT
కేవలం కొద్ది గంటల తేడా యూరప్ లో రెండు ప్రధాన ఘటనలు చోటు చేసుకున్నాయి. తన బ్రిటన్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోడీ బ్రిటన్ లోని వెంబ్లే స్టేడియంలో వేలాది ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగాన్ని చేస్తే.. కేవలం గంటల వ్యవధిలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉగ్రవాదులు ఘోరానికి పాల్పడ్డారు. అమాయకుల్ని లక్ష్యంగా చేసుకొని.. కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 150కు పైగా అమాయకులు మరణించినట్లు చెబుతున్నారు.

పారిస్ ఉగ్రదాడి జరగటానికి కొద్ది సేపటి ముందు లండన్ లో మాట్లాడిన మోడీ.. ప్రపంచానికి సవాలుగా మారిన సమస్యలు రెండేనని చెబుతూ.. అందులో ఉగ్రవాదాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తన ప్రసంగంలో ఎక్కువసేపు ఉగ్రవాదం మీద.. దాని కారణంగా చోటు చేసుకునే పరిణామాల మీద ఆందోళన వ్యక్తం చేసిన మోడీ మాటలకు తగ్గట్లే పారిస్ లో ఘోర దాడి జరగటం గమనార్హం. ఉగ్రవాదులపైనా.. ఉగ్రవాద సంస్థల మీదా ప్రపంచం చూడాల్సిన తీరును ఆయన స్పష్టంగా ప్రస్తావించిన సమయానికి కాస్త అటూ ఇటూగా పారిస్ నగరం ఉగ్రదాడితో రక్తమోడటం ప్రస్తావించాల్సిన అంశం.

ప్రాశ్చాత్య దేశాల పక్షపాత వైఖరితో కొన్ని ఉగ్రవాద సంస్థలపైనా..వారిని ప్రోత్సహించే దేశాల మీద ద్వంద వైఖరిని అనుసరిస్తున్నారంటూ సుతిమెత్తగా విమర్శలు చేసి.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపట్ల ఎంత కరుకుగా వ్యవహరించాలన్న విషయాన్ని చెప్పిన కాసేపటికే ఈ దారుణం చోటు చేసుకోవటం చూసినప్పుడు.. యూరప్ సమాజం ఇప్పుడు ఒక్కతాటి మీదకు రావాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే.. ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమైనదన్న విషయాన్ని భారత ప్రధాని మోడీ యూరప్ లోని బ్రిటన్ లో ఏర్పాటు చేసిన ఒక వేదిక మీద నుంచి ఆందోళన వ్యక్తం చేసిన కాసేపటికే.. అదే యూరప్ లోని మరో దేశమైన ఫ్రాన్స్ లో దారుణ మారణకాండ చోటు చేసుకోవటం గమనార్హం.
Tags:    

Similar News