బ్రసెల్స్ ను రాక్షసులు ఎందుకు టార్గెట్ చేశారు?

Update: 2016-03-23 04:38 GMT
యూరోపియన్ యూనియన్ లో మరో కీలకమైన దేశంపై నరరూప రాక్షసులకు ప్రతిరూపమైన ఐఎస్ ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రశాంత వాతావరణంలో హడావుడిగా ఉండే అందాల బెల్జియం మీద ఉగ్రమూక కన్నేసింది. ఆ దేశ రాజధాని బ్రసెల్స్ పై ఉగ్రపంజా విసిరింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన ఆత్మాహుతి దళాలు తమను తాము పేల్చేసుకోవటం ద్వారా 23 మంది మరణించగా.. పెద్ద ఎత్తున క్షతగాత్రులయ్యారు.

ఊహించని విధంగా చోటు చేసుకున్న ఈ పరిణామానికి బెల్జియం చిగురుటాకులా వణికిపోతే.. యూరోపియన్ దేశాలతో సహా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. విమానాశ్రయంలో రెండుసార్లు.. మెట్రో రైల్ స్టేషన్ లో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకోవటంతో పాటు.. విమానాశ్రయంలో పేలని బెల్ట్ బాంబును కనుగొన్న నేపథ్యంలో .. ఇలాంటి బాంబులు మరెన్ని ఉన్నాయన్నది ఇప్పుడు సందేహంగా మారింది.

పారిస్ ఉగ్రదాడులకు ప్రధాన వ్యూహకర్తగా అనుమానిస్తున్న అబ్దెస్లామ్ ను నాలుగు రోజుల క్రితం బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి ప్రతిగా భారీ విధ్వంసానికి ఐఎస్ తెర తీయటం గమనార్హం. తన ఉనికికి ఇబ్బందికరంగా మారే పరిస్థితుల్లో.. ఏ దేశంలోనైనా స్వల్ప వ్యవధిలో భారీ విధ్వంసాన్ని సృష్టించగల సత్తా తనకుందన్న విషయాన్ని ఐఎస్ తెలియజెప్పేందుకే తాజా ఉగ్రదాడిగా భావిస్తున్నారు.

పటిష్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోకి ఉగ్రవాదులు చొరబడి భారీగా దాడులకు తెగబడటం యూరోపియన్ దేశాల్ని కలవరపడేలా చేస్తోంది. నిజానికి అబ్దెస్లామ్ ను అదుపులోకి తీసుకున్న వెంటనే.. ప్రతీకార దాడులకు అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కూడా ఇంత భారీగా దాడులు జరగటం అందరిని నివ్వెరపోయేలా చేస్తోంది.

బెల్జియంను టార్గెట్ చేయటానికి ప్రత్యేక కారణం ఏమీ లేదని.. తమకు చెందిన కీలక నేతను అదుపులోకి తీసుకున్నందుకు ప్రతీకారం తీర్చుకోవటంతో పాటు.. తమ బలం బారీగా ఉందని.. ఎక్కడైనా క్రియాశీలకంగా వ్యవహరించగల సత్తా తమ సొంతమన్న విషయాన్ని తెలియజెప్పేందుకే తాజా దాడులుగా చెబుతున్నారు. బెల్జియంలోకి ఉగ్రవాదుల ప్రవేశం ఎలా సాధ్యమన్న విషయానికి వస్తే.. మధ్యప్రాచ్యం.. ఉత్తర ఆఫ్రికాల నుంచి నిత్యం వేలాదిగా వచ్చే శరణార్థులతో కలిసిపోయిన ఉగ్రవాదులు.. దేశంలోని సులువుగా ప్రవేశిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఉగ్రవాదుల కారణంగా.. శరణార్థుల కష్టాలు మరింత పెరగటం ఖాయంగా ఉంది. వారి బతుకులు మరింత దయనీయంగా మారనున్నాయి.
Tags:    

Similar News