నాడు మన విమానం హైజాక్.. నేడు అక్కడికే విమానంలో సాయం

Update: 2022-06-24 11:30 GMT
కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది.. అది మనుషులకైనా.. దేశాలకైనా..? ఇదే ఉదాహరణ ఇప్పుడు అఫ్గానిస్థాన్ కు వర్తిస్తోంది.. ఎందుకంటే ఆ దేశం అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటోంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. అది 1999 డిసెంబరు 24. ఓ శీతాకాలం సాయంత్రం వేళ 5.30 సమయం. నేపాల్ రాజధాని కాట్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 814 (ఐసీ 814) ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి బయల్దేరింది. భారత గగనతలంలోకి ప్రవేశించిన కాసేపటికే ముసుగులు ధరించిన ఐదుగురు ఉగ్రవాదులు దానిని హైజాక్ చేశారు. పంజాబ్ లోని అమ్రత్ సర్, పాకిస్థాన్ లోని లాహోర్, పర్షియన్ గల్ఫ్ ఆఫ్ దుబాయ్ ఇలా వివిధ ప్రదేశాలకు తిప్పి చివరకు అఫ్గానిస్థాన్ లోని కాందహార్ కు తీసుకెళ్లారు. అక్కడ అప్పట్లో తాలిబన్ల ప్రాబల్యం ఉండేది. ఈ క్రమంలో 176 మంది ప్రయాణికులకు గాను.. 27 మందిని దుబాయ్ లో విడిచిపెట్టారు. కానీ, అంతకుముందే విమానంలో తిరగబడిని కొత్తగా పెళ్లయిన ఓ యువకుడిని హతమార్చారు. చాలామందిని గాయపర్చారు.

రోజుల కొద్దీ హై డ్రామా.. కనుక్కొన్నది అజిత్ దోబాల్ విమానం నాడు కాందహార్ చేరాక పూర్తిగా దానికి తాలిబన్లు కాపలా కాశారు. అంటే భారత్ ఎలాంటి దాడి చేసినా తాలిబాన్ మిలిషీయా వారినే ఎదుర్కొనాల్సి వచ్చేది. చిత్రమేమంటే తాలిబన్లు మన విమానం చుట్టూ పహారా కాస్తున్న సంగతిని గుర్తించినది ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్. అప్పట్లో ఆయన కాందహార్ వెళ్లి మరీ ఈ విషయాన్ని పసిగట్టారు. అంతేకాదు.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సైతం విమానం వద్ద నిఘాలో ఉన్నారని బయటపెట్టారు.

అయితే, తాలిబన్లు గనుక నాడు భారత విమానానికి అడ్డుగా లేకుంటే.. మనం దానిని క్షేమంగా విడిపించగలిగే వారమని చెప్పారు. ఈ డ్రామా వారం రోజులు సాగింది. భారత్ అరెస్టు చేసిన కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ సహా ముగ్గురు ఉగ్రవాదులను విడిపెట్టాక గానీ.. కాందహార్ లోని మన విమానానికి మోక్షం కలగలేదు. ఈ ఉగ్రవాదులే తర్వాత 2002లో అమెరికా జర్నలిస్టు డానియల్ పెర్ల్ హత్య, 2008 ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించారు. కాగా, ఈ హైజాకింగ్ కుట్రలో బిన్ లాడెన్ సారథ్యంలోని ఆల్ ఖైదా కుట్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరకు కుట్రదారుల్లో ఒకరైన జహూర్ మిస్త్రీ 1999లో కరాచీలో హత్యకు గురయ్యాడు.

మరిప్పుడు..గతేడాది అఫ్గాన్ లో ప్రభుత్వం కూలిపోయింది. దేశం మొత్తం తాలిబన్ల వశమైంది. ఇప్పుడక్కడ వారి పాలనే నడుస్తోంది. ఇటీవల ఓ గురద్వారాపై ఐసిస్ మూకల దాడి సందర్భంగా తాలిబన్ సైనికులే రక్షణగా నిలిచారు. అయితే, మూడు రోజుల కిందటి భూకంపంలో అఫ్గాన్ తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో ఆ దేశానికి భారత్‌ మానవతాసాయం అందించింది. గురువారం రాత్రి ఓ విమానంలో కొన్ని పరికరాలు, ఇతర సహాయ సామగ్రిని కాబుల్‌ పంపింది. దీన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ట్వీట్‌ చేశారు. దీనిని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ రీట్వీట్‌ చేశారు.

ఈ సహాయ సామగ్రితో పాటు ఒక సాంకేతిక బృందం కూడా కాబూల్‌ వెళ్లింది. భూకంపంలో దెబ్బతిన్న అఫ్గాన్‌కు తొలుత సాయం పంపిన దేశం భారతే కావడం విశేషం. భారత్‌ నుంచి వెళ్లిన బృందంలోని సభ్యులు తాలిబన్లతో కలిసి మనవతా సాయం పంపిణీని పర్యవేక్షించనున్నారు. ఈ బృందం అక్కడ ఉన్న భారత దౌత్యకార్యాలయం నుంచి పని చేయనుంది. దీంతో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. తొలిసారి కాబూల్‌లోని భారత దౌత్యకార్యాలయంలో సిబ్బంది పనిచేస్తున్నట్లైంది. భారత దౌత్య బృంద భద్రతకు తాలిబన్లు పలు మార్లు హామీలు ఇచ్చాక ఈ సాంకేతిక టీమ్‌ అఫ్గానిస్థాన్‌కు వెళ్లింది.

500 మంది క్షతగాత్రులకు 5 పడకలే..!ఉగ్రదాడులు, తాలిబన్ల దెబ్బకు కుదేలైపోయిన అఫ్గానిస్థాన్‌కు భూకంపం రూపంలో మరో విపత్తు వచ్చిపడింది. ఇటీవల భూకంపంలో భారీ ఎత్తున ఇళ్లు దెబ్బతిన్నాయి. క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కానీ, వారికి తగిన వైద్య సదుపాయాలు కరవయ్యాయి. అఫ్గానిస్థాన్‌లోని జ్ఞాన్‌ అనే గ్రామం తీవ్రంగా దెబ్బతింది. వైద్యశాల కూడా నేలమట్టం అయింది. వందల సంఖ్యలో క్షతగాత్రులు వస్తుండగా.. వారికి సేవలు అందించేందుకు ఐదు పడకలు మాత్రమే ఉన్నాయి. ఇక ఆసుపత్రి పరికరాలు మొత్తం దెబ్బతిన్నాయి. ఇక్కడ వైద్య సిబ్బందిలో ఒకరైన గుల్‌.. ఓ ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ "ఇక్కడకు 500 మంది క్షతగాత్రులు రాగా.. వారిలో 200 మంది మరణించారు" అని పేర్కొన్నారు.
Tags:    

Similar News