వారికి చేతగాక మీడియాపై కేసులు పెడతార్ట!

Update: 2018-03-03 04:26 GMT
నిర్దిష్టమైన ఆలోచన లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా తెలుగుదేశం నాయకులు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఏం చేయబోతున్నారనే దానిపై ఏ ఇద్దరి మాటల మధ్య పొంతన లేదు. ఏ ఇద్దరి ఆలోచనల మధ్య సారూప్యత లేదు.. పార్టీకి టోటల్ గా ఒక విధానం అంటూ లేదు.. ఇలా ఆ పార్టీ ఎంపీలు చెలరేగుతోంటే.. వారు మాట్లాడిన మాటల్ని ప్రజలకు తెలియజెప్పినందుకు మీడియా మీదు కేసులు పెట్టాలని తెలుగుదేశం యోచిస్తుండడం గమనార్హం. వాళ్లకు వాళ్లకు చేతకాక ఎలా పడితే అలా మాట్లాడుతూ.. ఆ మాటలు వివాదాస్పదంగా మారగానే.. ‘వక్రీకరించేశారని..’ మీడియా మీద విరుచుకు పడడం ఏం ధర్మం అని పలువురు దెప్పి పొడుస్తున్నారు. తాజాగా టీజీ వెంకటేష్ మాటల నేపథ్యంలో పార్టీ భేటీలో ఇలాంటి చర్చ జరగడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

భాజపా నాయకులు రాయలసీమలో రెండో రాజధాని కావాలంటూ ఒక డిక్లరేషన్ ను రూపొందించిన తర్వాత.. తెదేపా ఎంపీ దానికి జై కొట్టారు. తాను ఈ మాట ఎప్పటినుంచో చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని.. రాయలసీమలో రెండో రాజధాని ఉండాల్సిందేనని టీజీ వెంకటేష్ ఆ సమయంలో మీడియాతో అన్నారు.

తీరా దీన్ని ఎంపీల సమావేశంలో ప్రస్తావించి.. అలా భాజపా వారి డిమాండును ఎందుకు సమర్థించారంటూ.. చంద్రబాబు ఆగ్రహించే సరికి టీజీ తుస్సుమనిపోయారు. ‘అలా అన్లేదు.. మీడియా వక్రీకరించింది..’ అంటూ పత్రికల మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు.

వక్రీకరిస్తే వెంటనే ఖండించాలని - అవసరమైతే పరువునష్టం కేసులు వేయాలని చంద్రబాబు మీడియా మీద హూంకరించడం విశేషం. ఇదేదో ఉరుమురిమి మంగలం మీద పడ్డదన్న  సామెత లాగా ఉన్నదని పాత్రికేయులు అనుకుంటున్నారు.

మీరు చేతగాక చెప్పిన మాటల్ని యథాతథంగా రాస్తే మాదే తప్పా అంటున్నారు. ఇప్పటికైనా టీజీ వెంకటేష్ కు చిత్తశుద్ధి ఉంటే స్టేట్ మెంట్ ఇవ్వాలని.. రాయలసీమకు రెండో రాజధాని - హైకోర్టు రావాలా వద్దా.. తన అభిప్రాయం ఏమిటి? అనేది వెల్లడించి.. నాటకాలు కట్టిపెట్టాలని మీడియాలో ఆక్రోశం వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News