కర్నూలు ఒక్కటి చాలంటున్న టీజీ

Update: 2015-10-03 07:39 GMT
కొత్త రాష్ట్రంలో చంద్రబాబు ఇప్పటికే ఎన్నో కష్టాలు చూశారు... ఒక్కొక్కటి దాటుకుంటూ ముందుకెళ్తుంటే సొంత పార్టీ నాయకుల నుంచి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పనిలేని పొలిటీషియన్లతో రోజుకో తలనొప్పి వస్తోందాయనకు. విపక్షాల నుంచి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనుకుంటే ఫరవాలేదు కానీ, సొంత పార్టీలోనే మంట పెట్టే నేతలతోనే సమస్య ఎదుర్కొంటున్నారు. ఊరికే ఉండకుండా ఏదో ఒకటి రేపే టీజీ వెంకటేశ్ తో తాజాగా మళ్లీ చికాకు వస్తోంది.

గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన టీజీ వెంకటేశ్ సొంత నియోజకవర్గానికి కూడా ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు మొత్తం రాయలసీమకు ఏదో ఉద్దరించేస్తానని చెబుతున్నారు. అది కూడా తాను చేస్తానని కాదు.... రాష్ట్రానికి కర్నూలును రెండో రాజధాని చేయాలని డిమాండు చేసి... సాధించుకుని రాయలసీమను అభివృద్ధి చేసేస్తానన్నది ఈయన చెబుతున్నమాట. అక్కడితో ఆగని ఆయన అమరావతిని ఫ్రీజోన్ చేయాలనీ అడుగుతున్నారు.

ఒకవైపు పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీరందించాలనే ప్లాను... హంద్రీ నీవా పనులు వేగవంతం... రాయలసీమలో పలు కంపెనీల ఏర్పాటు వంటి చర్యలతో అభివృద్దికి చంద్రబాబు ప్రణాళికలు రచిస్తుంటే... ఒక్క కర్నూలు ను రెండో రాజధాని చేయాలని కోరుతూ మొత్తం రాయలసీమను విస్మరిస్తున్నారు టీజీ.

...అయితే.. రాయలసీమ హక్కులు, పరిరక్షణ అంటూ ఎప్పటినుంచో డప్పుచప్పుళ్లు చేస్తున్న టీజీకి ఉన్న సీరియస్ నెస్ ఎంతో అందరికీ తెలిసిందే. కొత్త రాష్ట్రంలో పవర్ ప్లాంట్లు... ఇంకేదైనా అవసరాల కోసమో చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకే ఆయన ఈ ఎత్తుగడ వేస్తున్నారని చెబుతున్నారు.
Tags:    

Similar News