ఐల‌య్య‌ను ఉరితీయండి...అంటున్న టీడీపీ ఎంపీ

Update: 2017-09-27 13:26 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న ‘సామాజిక స్మగ్లర్లు – కోమటోళ్లు’ పుస్త‌క ర‌చ‌యిత‌, మాజీ ఫ్రొఫెస‌ర్ కంచ ఐల‌య్య సృష్టించిన క‌ల‌క‌లం రేపుతోంది. ఇటు ఆర్య‌వైశ్య నేత‌లు మొదలుకొని అటు వివిధ పార్టీల నేత‌లు త‌మ నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఐల‌య్య‌పై టీడీపీ ఎంపీ టీజీ వెంక‌టేశ్ మ‌రోసారి ఫైర‌య్యారు.  కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాల‌ని డిమాండ్ చేశారు. ఐల‌య్య‌ను న‌డిరోడ్డుపై ఉరివేయాల‌ని తాను గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని టీజీ వెంక‌టేష్ స్ప‌ష్టం చేశారు.

ఎవరికీ ఇతరులను కించపరిచే హక్కు లేదని, ఈ విధంగా పుస్తకాలు రాయడం సరైంది కాదని ఎంపీ టీజీ వెంక‌టేష్ వెల్ల‌డించారు. కులాలు, మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టే ఐల‌య్య లాంటి వారిని ఉరివేయడానికి అవ‌స‌ర‌మైతే చ‌ట్టాల‌ను మార్చాల‌ని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు సైతం త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. కాగా, కంచ ఐల‌య్య పుస్త‌కంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు సైతం స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఎవరు ఏ పుస్తకం రాసినా ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని వ్యాఖ్యానించారు. ప్రొ. కంచ ఐలయ్య రాసిన ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో లేకుండా చూస్తామని తెలిపారు. విద్వేషాలు రగిల్చేవిధంగా వ్యవహరిం చడం తగదని, విజ్ఞతతో వ్యవహరించాలని సీఎం అన్నారు.

మ‌రోవైపు త‌న‌కు తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ క‌ల్పించ‌ని నేప‌థ్యంలో తాను రెండు వారాల పాటు అజ్ఞాతంలోకి పోతున్న‌ట్లు కంచె ఐల‌య్య స్వ‌యంగా ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News