ఎలాన్ మ‌స్క్ ప్ర‌తిపాద‌న‌పై మండిప‌డ్డ ఆ దేశం!

Update: 2022-10-10 10:30 GMT
టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత.. ఎలాన్ మ‌స్క్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఆయ‌న దేనిపైన అయినా ఒక్క ట్వీట్ చేశారంటే అది క్ష‌ణాల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌ల్ అయిపోతుంది. ఆయ‌న ఏం పోస్టు పెట్టారా అని మీడియా వ‌ర్గాల‌తోపాటు సెల‌బ్రిటీలు కూడా అనుక్ష‌ణం గ‌మ‌నిస్తుంటారంటే అతిశ‌యోక్తి కాదు. ఇటీవ‌ల బిట్ కాయిన్ల వ్య‌వ‌హారంలో, ట్విట్ట‌ర్ కొనుగోలు వ్య‌వ‌హారంలో, ఉక్రెయిన్‌కు నిరంత‌రాయంగా ఇంట‌ర్నెట్ స‌ర‌ఫరా చేయ‌డంలో ఎలాన్ మ‌స్క్ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఎలాన్ మ‌స్క్.. చైనా, తైవావ్ వివాదంలో వేలు కాకుండా ఏకంగా కాలే పెట్టారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారంలో ఒక దేశం ఎలాన్ మ‌స్క్‌పై మండిప‌డుతుండ‌గా.. ఇంకో దేశం పొంగిపోతోంది. అయితే ఎలాన్ మ‌స్క్ ఏం అన్నార‌నేగా మీ సందేహం..?. తైవాన్ ఒక‌ప్పుడు త‌మ‌లో భాగ‌మేన‌ని.. దాన్ని త‌మ‌లో విలీనం చేసుకుంటామంటూ చైనా ఆ దేశంపై దురాక్ర‌మ‌ణ‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు కూడా చేప‌ట్టింది. అంతేకాకుండా తైవాన్ గ‌గ‌న‌తలంలోకి చైనా యుద్ధ విమానాల‌ను పంపి రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో ఎలాన్ మ‌స్క్ త‌నదైన శైలిలో ఒక ప్ర‌తిపాద‌న చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ఇంగ్లిష్ పేప‌ర‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. చైనాలో తైవాన్‌ను ఒక ప‌రిపాల‌న జోన్‌గా చేయాల‌న్నారు. ఇది స‌హేతుకంగా ఉంటుంద‌ని చెప్పారు. అయితే ఇది అంద‌రినీ సంతోష‌పెట్ట‌క‌పోవ‌చ్చ‌ని తెలిపారు. దీనిపై చైనా సంతోష‌ప‌డ‌గా.. తైవాన్ మండిప‌డింది.

మస్క్‌ ప్రతిపాదనపై అమెరికాలోని చైనా రాయబారి క్విన్‌ గ్వాంగ్‌ స్పందించారు. ఈ ప్రతిపాదన చేసినందుకు మస్క్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. " తైవాన్‌ను ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్నందుకు, తైవాన్‌ జలసంధిలో శాంతికి పిలుపునిచ్చినందుకు మస్క్‌కు ధన్యవాదాలు. వాస్తవానికి ఒక దేశం... రెండు వ్యవస్థలన్నవి తైవాన్‌ ప్రశ్నలను పరిష్కరించేందుకు చైనా ప్రాథమిక విధానాలు" అని క్విన్ గాంగ్ తెలిపారు.

మరో వైపు ఎలాన్ మ‌స్క్‌ ప్రతిపాదనలపై తైవాన్‌ తీవ్రంగా మండిప‌డింది. త‌మ స్వాతంత్య్రం అమ్మకానికి లేదని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. వాషింగ్టన్‌లో తైవాన్‌ అనధికార ప్రతినిధి బి ఖిమ్‌ హిస్సావో ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో స్పందించారు.

"తైవాన్‌ చాలా ఉత్పత్తులను విక్రయిస్తుంది. కానీ, స్వేచ్ఛ, స్వాతంత్య్రం మాత్రం అమ్మ‌కానికి లేవు. భవిష్యత్తు కోసం చేసే శాశ్వత ప్రతిపాదనలు శాంతియుతంగా, భయరహితంగా, తైవాన్‌ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించేలా ఉండాలి" అని ఎలాన్ మ‌స్క్ ప్ర‌తిపాద‌న‌కు తీవ్ర స్థాయిలో కౌంట‌ర్లు వేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News