ఇందుకే బీజేపీకి డిపాజిట్లు కూడా రావటంలేదు

Update: 2021-07-25 23:30 GMT
దేశంలోని ఉత్తరాధిలో బీజేపీ ఎంత ఊపుమీదున్నా దక్షిణాదిలో ప్రత్యేకించి ఏపిలో పరిస్ధితి మాత్రం చాలా దయనీయంగానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన నేతల్లో ఎవరికీ డిపాజిట్లు కూడా రాలేదు. డిపాజిట్లు సంగతి పక్కనపెట్టేస్తే చాలా చోట్ల పోటీకి కూడా గట్టి అభ్యర్ధులు దొరకలేదు. కమలంపార్టీకి ఇంతటి దారుణమైన పరిస్దితులకు ప్రధాన కారణం ఆ పార్టీ అగ్రనేతలే అని చెప్పాలి.

పార్టీలో అగ్రనేతలంటే ఏపిలో నేతలని కాదు అర్ధం. ఎందుకంటే ఏపిలో అంత సీనున్న నేతలు ఎవరూ లేరులేండి. అగ్రనేతలంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా లాంటి వాళ్ళే అనిఅర్ధం. రాష్ట్రంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీకి విభజన చట్టంలోని హామీలను అమలు చేసుంటే జనాల్లో మంచిపేరు వచ్చుండేది. పార్టీబలం లేని రాష్ట్రంలో బలం పుంజుకోవాలంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగానే నాలుగు మంచిపనులు చేసి జనాల మద్దుతును పొందాలని అనుకుంటుంది.

కానీ మోడి, అమిత్ ద్వయం మాత్రం విభజన చట్టాన్ని తుంగలో తొక్కటం ద్వారా పార్టీని మరింత పాతాళంలోకి నెట్టేయాలని కంకణం కట్టుకున్నట్లే ఉన్నారు. దానికి తగ్గట్లే 2014 కాలంలో ఏపి నుండి ప్రాతినిధ్యం వహించిన వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు వ్యవహరించారు. ప్రత్యేకహోదా లేదు, రైల్వేజోన్ పోయింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు లేవు. ఇవన్నీ ఒకఎత్తైతే చివరకు విశాఖస్టీల్ ప్లాంటును కూడా ప్రైవేటుపరం చేసేస్తున్నారు. తాజాగా పోలవరం ప్రాజెక్టులోని భూసేకరణ, పునరావసం వ్యయంతో సంబంధం లేదని స్పష్టంగా చెప్పేసింది.

ఇదే సమయంలో కరోనా వైరస్ విషయంలో టీకాలు సరిగా సరఫరా చేయకపోవటం, నిధులు అవసరమైనంత ఇవ్వకపోవటంతో కేంద్రంపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఏ కోణంలో చూసినా బీజేపీని ఎందుకు ఆదరించాలి ? అనే విషయంలో జనాల్లో స్పష్టమైన క్లారిటి వచ్చేసింది. విచిత్రమేమిటంటే విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించేది బీజేపీ ప్రభుత్వమే, ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తులు ఇస్తున్నదీ బీజేపీ నేతలే. అంటే వీళ్ళడ్రామాను జనాలు గుర్తించటం లేదని బహుశా కమలనాదులు అనుకుంటున్నారేమో.

ఇలాంటి అనేక కారణాల వల్ల బీజేపీకి డిపాజిట్లు కూడా రావటంలేదు. ఎప్పుడైతే కేంద్రంలో బలమైన గాలి వీచినపుడు వస్తే ఓ నాలుగు సీట్లొస్తాయేమో కానీ మామూలుగా అయితే పోటీకి అభ్యర్ధులూ దొరకరు, పోటీ చేసిన వారికి డిపాజిట్లు కూడా దక్కవన్నది వాస్తవం. ఇప్పటికైనా బీజేపీ అగ్రనేతలు కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తే వచ్చే ఎన్నికలకైనా నాలుగు సీట్లు వస్తాయని ఆశించచ్చు. లేకపోతే పోటీచేయటం కూడా దండగే.


Tags:    

Similar News