జగన్ ను పవన్ ఎందుకంత పర్సనల్ గా తీసుకుంటారు?

Update: 2023-06-15 17:03 GMT
ఏపీ సీఎం జగన్ కు జనసేన అధినేత పవన్ కు పంచాయితీ ఎక్కడ షురూ అయ్యింది? అన్న ప్రశ్న పలువురి మదిని తొలిచేస్తూ ఉంటుంది. దీని పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. ఇదే విషయాన్ని వైసీపీకి చెందిన ప్రముఖులు మొదలు డైహార్ట్ ఫ్యాన్స్ ను అడిగినా..వెంటనే సమాధానం చెప్పలేరు.

ఇదే ప్రశ్నను జనసేన కు చెందిన వారితో పాటు పవన్ అంటే పిచ్చి పిచ్చిగా అభిమానించి.. ప్రేమించే వారిని అడిగినా వెంటనే బదులివ్వకపోవటం కనిపిస్తుంది. ఇంతకీ.. జగన్ కు.. పవన్ కు తేడా ఎక్కడ మొదలైంది? అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి.. బీజేపీ ముఖ్యుల ను సైతం వెనుకా ముందు చూసుకోకుండా మాటలు అనేసిన పవన్.. ఆ తర్వాత నుంచి వారిని పల్లెత్తు మాట అనకపోవటం కనిపిస్తుంది.

మరి.. కమలనాథులు అంటే అంత కోపం ఉన్న పవన్.. మరి అంతలా ఎందుకు రాజీ పడ్డారు? కమలనాథలు విషయం లో ఆయన పది అడుగులు వెనక్కి వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన మాత్రం అందుకు భిన్నంగా మొండిగా ఎందుకు వ్యవహరిస్తారు? అన్నది ప్రశ్న. తన సినిమాలు తాను తీసుకుంటూ.. తన మానాన తాను ఉండే పవన్ కు.. రాజకీయాలు.. వ్యాపారాలు తప్పించి మిగిలిన విషయాల్ని పెద్దగా పట్టించుకోని జగన్ కు మధ్య పూడ్చలేనంత గ్యాప్ ఎందుకు వచ్చినట్లు? అన్నది ప్రశ్నగా మారింది.

అయితే.. కత్తిపూడి లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో తనకున్న పంచాయితీని పవన్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. కాకుంటే.. చాలా జాగ్రత్తగా పవన్ ఈ విషయాన్ని ప్రస్తావించటం కనిపిస్తుంది.కత్తిపూడి లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. "కోట్లాది మంది అభిమానులు ఉన్న వారిని చేతులు కట్టుకునేలా చేస్తారా?" అంటూ పవన్ కల్యాణ్ ప్రస్తావించటం చూస్తే.. సీఎం జగన్ మీద పవన్ కు ఎందుకంత ఆగ్రహం అన్న విషయం పై కాసింత అవగాహన కలుగుతుందని చెప్పాలి.

అప్పట్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖుల్ని తన ఇంటికి పిలిపించుకోవటం.. మెగాస్టార్ చిరు చేత నమస్కారం పెట్టించుకోవటం.. ఆ సందర్భంగా సీఎంగా ఉన్న జగన్ ప్రతినమస్కారం పెట్టలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

దీనికిసంబంధించిన వీడియో ఒకటి విడుదల కావటం.. అది కాస్తా వైరల్ గా మారినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. చిత్ర రంగానికి చెందిన ప్రముఖులు సైతం ముఖ్యమంత్రి వద్ద చేతులు కట్టుకొని నిలబడటాన్ని పవన్  జీర్ణించు కోలేకపోయినట్లుగా కొందరు విశ్లేషిస్తారు. వీరి వాదన కు తగ్గట్లే.. తాజాగా కత్తిపూడి బహిరంగ సభలో జనసేనాని వ్యాఖ్యలు నిదర్శనమన్న వాదనలో కాస్తంత నిజం ఉందన్న భావన కలుగక మానదు.

Similar News