ఆ ప్రధాని ప్రేమ పురాణం.. ఓ ప్రేయసికి రాసిచ్చిన ఆస్తులు..

Update: 2023-07-10 13:32 GMT
ఆ రాణి ప్రేమ పురాణం.. ఆ ముట్టడికైన ఖర్చులు.. అని ఓ పాట.. కానీ, ఇక్కడ చెప్పుకోబోయే విషయం తెలిస్తే "ఓ ప్రధాని ప్రేమ పురాణం.. ఆ ప్రేయసికి రాసిచ్చిన ఆస్తులు" అని చదువుకోవాల్సి వస్తుంది. అంతటి సరసుడు ఆ (మాజీ) ప్రధాని మరి.. వేల కోట్లకు అధిపతి.. సుదీర్ఘ కాలం పదవి.. అనేక వివాదాలు.. అవినీతి ఆరోపణలు.. ఇదీ ఆయన ప్రస్థానం. పదవి కోల్పోయి.. 86 ఏళ్ల వయసు లో ఇటీవల చనిపోయిన ఆయన గురించి కథలుకథలుగా చెబుతారు. ఎంతలా అంటే.. ఇటలీ విలాస పురుషుడు.. సోగ్గాడు అని అభివర్ణిస్తారు.

ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ తర్వాత యూరప్ లో ఇటలీ పెద్ద దేశం. అంతేకాదు మాఫియా కు పేరుగాంచింది. అలాంటి ఇటలీని సిల్వియో బెర్లుస్కోని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించారు. ఓ దశలో ఆయన ఎదురులేని నేత. ఇక బెర్లుస్కోని బిలియనీర్. భారత కరెన్సీలో చెప్పాలంటే వేలాది కోట్లకు అధిపతి. గత నెలలో ఆయన మరణం తర్వాత ఆస్తి పంపకాలు జరిగాయి. ఆ విల్లును తాజాగా మీడియా సమక్షం లో బెర్లుస్కోని వారసుల కు వినిపించారు.

ఆయనకు 86.. ఆమెకు 33

చనిపోయేనాటికి బెర్లుస్కోని వయసు 86.. సరసుడి గా పేరున్న ఆయనకు ఓ ప్రేయసి కూడా ఉంది. వీలునామా గురించి చెప్పే సందర్భంలో ఓ ఆస్తి పంపకాల కు సంబంధించి ఆశ్చర్యకర విషయం వెలుగు లోకి వచ్చింది. 33 ఏళ్ల వయసున్న ప్రేయసి కోసం బెర్లుస్కోని ఏకంగా రూ.900 కోట్లు రాసిచ్చారట.

ఎవరా ప్రేయసి..? 83 ఏళ్ల వయసు లో ప్రేమాయాణం

బెర్లుస్కోని 33 ఏళ్ల ప్రేయసి పేరు మార్టా ఫాసినా. వీరి బంధం 2020 మార్చిలో మొదలైంది. అంటే అప్పటికే బెర్లుస్కోనికి 83 ఏళ్లు. ఇక

ఇద్దరి మధ్యా వయసు లో దాదాపు 53 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఫాసినాను సిల్వియో చట్ట ప్రకారం వివాహం చేసుకోలేదు. అయితే, భార్యగా చెప్పేవారు. 100 మిలియన్  యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.905 కోట్లు) ఆస్తిని ఆమెకు రాసిచ్చారు. కాగా, ఫాసినా కూడా రాజకీయ నాయకురాలే. ఇటలీ పార్లమెంట్‌ దిగువ ఛాంబర్‌ లో 2018 నుంచి సభ్యురాలు. సిల్వియో పార్టీ ఫోర్జా ఇటాలియా లో సభ్యులు.

మీడియా, బిజినెస్, పాలిటిక్స్..

బెర్లుస్కోని మీడియా అధిపతి. దీనికితోడు వ్యాపారి. రాజకీయ నాయకుడు కూడా.. ఈయన ఆస్తుల విలువ దాదాపు 6 బిలియన్‌ యూరోలు. మన  కరెన్సీ లో రూ.54వేల కోట్లకు పైమాటే. కాగా, బెర్లుస్కోని చట్టపరంగా ఇద్దరిని పెళ్లాడారు. ఇద్దరితో డేటింగ్‌ చేశారు. ఆయనకు ఐదుగురు పిల్లలు. బెర్లుస్కోని వ్యాపార సామ్రాజ్యాన్ని పెద్ద కుమార్తె మారినా, పెద్ద కుమారుడు పీర్‌ సిల్వియో పర్యవేక్షిస్తున్నారు. కాగా వీలునామాను ఐదుగురు పిల్లలు, సాక్షుల సమక్షం లో చదివి వినిపించారు. ఆస్తుల్లో చాలా వరకు పిల్లలకే పంచివ్వడం బెర్లుస్కోని గొప్పదనం. అయితే, ప్రేయసి తో సమానంగా 100 మిలియన్‌ యూరోల ను సోదరుడు పాలో కు రాసిచ్చారు. పార్టీ మాజీ సెనెటర్‌, ఆప్తుడు మార్సెలో డెలుట్రీకి 30 మిలియన్ యూరోల ఆస్తి రాసిచ్చారు. లుకేమియాతో బెర్లుస్కోని జూన్‌ 12న చనిపోయారు.

ఇటలీ వంటి దేశానికి మూడు సార్లు ప్రధాని పనిచేశరు. ఆ దేశాన్ని అత్యధిక కాలం పాలించింది ఆయనే. ప్రభావవంతమైన మీడియా అధినేతగా ఉండేవారు. ఇటలీ లో మూడో సంపన్న వ్యక్తి. కానీ, విలాసాలు, లైంగిక ఆరోపణలు, అవినీతి కేసులు.. ఇలా జీవితం లో ఎన్నో వివాదాలు, చీకటి కోణాలున్నాయి.

Similar News