ఆ సీఎం సంచలన నిర్ణయం.. ప్రజలందరికి ఉచిత వ్యాక్సిన్

Update: 2020-12-13 11:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ వచ్చేయటం తెలిసిందే. ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ షురూ చేశారు. కొన్నిచోట్ల సైడ్ ఎఫెక్టులు వస్తున్నా.. మొత్తంగా అయితే ఫర్లేదన్న మాట వినిపిస్తోంది. సరైన పద్దతిలో వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదం లేదన్నట్లుగా ఇప్పటికే టీకా వేయించుకున్న వారంతా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మన దేశంలో జనవరి 15 నుంచి టీకా పంపిణీ చేస్తామని కేంద్రం ప్రకటించటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగా.. తమ ప్రజలందరికి ఉచిత టీకా వేసేందుకు వీలుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు.. మధ్యప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రులు తమ ప్రజలందరికి ఉచిత టీకా వేస్తామని ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేరారు. ఇక్కడ కేరళ తాజా పరిస్థితి గురించి ప్రస్తావించాలి.

వాస్తవానికి దేశంలో తొలి కేసు కేరళలోనే వెలుగు చూసింది. ఆ తర్వాతి కాలంలో ఆ రాష్ట్రంలో కేసులు నమోదైనా.. కరోనా వ్యాప్తిని తొలిదశలో సమర్థవంతంగా ఆపిన ఘన పినరయి సర్కారుదేనని చెప్పాలి. మొదటిదశలో కరోనాకు చెక్ పెట్టటంలో సక్సెస్ అయిన కేరళ సర్కారు.. ఓనం పండుగ తర్వాత నుంచి మాత్రం కేసుల నమోదు అంతకంతకూ పెరిగిపోయే పరిస్థితి. దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా సెకండ్ వేవ్ తన తఢాఖా చూపిస్తోంది.

ఒక్క శనివారమే కేరళలో 5,949 కేసులు నమోదు అయ్యాయంటే.. ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. మన దేశంలో వ్యాక్సిన్ ట్రయల్ రన్ జోరుగా సాగుతోంది. కరోనా వ్యాక్సిన్ ను ఈ నెల 25న దేశంలో లాంఛ్ చేస్తున్నారు. వచ్చే నెలలో దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేరళ సీఎం కీలక ప్రకటన చేశారు. కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్న పినరయ్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందజేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు ఇస్తుందన్న విషయం తెలియనప్పటికీ.. తాము మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా టీకా అందజేస్తామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయం మీద ప్రకటన చేస్తే బాగుంటుంది.


Tags:    

Similar News