ఆ వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడు? ఎన్ని?

Update: 2021-05-26 12:30 GMT
ప్ర‌పంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ అంటూ జ‌న‌వ‌రిలో ఘ‌నంగా ప్రారంభించి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌దేశంలో ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారో తెలుసా? సుమారు 20 కోట్ల మేర మాత్రమే! దాదాపు 135 కోట్ల జ‌నాభా ఉన్న దేశంలో.. ఇది ఏ మూల‌కు అన్న‌ది అంచ‌నా వేయొచ్చు. భార‌త్ భ‌యోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్ ఉత్ప‌త్తి చేస్తున్న రెండు టీకాలు దేశం అవ‌స‌రాల‌ను ఏ మాత్రం తీర్చ‌లేక‌పోతున్నాయ‌ని తేలిపోయింది. దీంతో.. అనివార్యంగా విదేశీ టీకాల‌కు త‌లుపులు తెర‌వాల్సి వ‌చ్చింది.

రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వి కొద్దిమేర దేశానికి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అది ఏమాత్ర‌మూ స‌రిపోదు. దీంతో.. మ‌రింత వ్యాక్సిన్ కోసం యుఎస్ ఫార్మా దిగ్గజం ఫైజర్, మోడెర్నా టీకాల ప్ర‌తినిధుల‌తో.. కేంద్ర మంత్రి జైశంక‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. అయితే.. వ్యాక్సిన్ ల‌భ్య‌త ఎక్కువ‌గా లేక‌పోవ‌డంతో భారీగా టీకా స‌ర‌ఫ‌రా చేయలేక‌పోతున్న‌ట్టు ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధులు తెలిపారు. అదికూడా.. ఫైజ‌ర్ మాత్ర‌మే త్వ‌ర‌లో వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని చెప్ప‌గా.. మోడెర్నా మాత్రం వ‌చ్చే ఏడాది వ‌ర‌కు అవ‌కాశం లేద‌ని చెప్పింది.

ఫైజ‌ర్ ఈ ఏడాది భార‌త్ కు మొత్తం 5 కోట్ల డోసుల‌ను ఇవ్వ‌డానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. వీటిని వ‌చ్చే నెల నుంచే ద‌శ‌ల‌వారీగా అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. త‌మ‌కు అందుబాటులో ఉన్న ల‌భ్య‌త ప్ర‌కారం.. జూలైలో ఒక కోటి డోసులు, ఆగస్టులో మ‌రో కోటి డోసులు పంపిస్తామ‌ని చెప్పింది ఫైజ‌ర్‌. ఆ త‌ర్వాత‌ సెప్టెంబర్‌లో 2 కోట్లు, అక్టోబర్‌లో మ‌రో కోటి డోసుల‌ను భారతదేశానికి సరఫరా చేయగలమని, అది కూడా కేంద్ర ప్ర‌భుత్వంతో మాత్ర‌మే డీల్ కుదుర్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. దీనికిగానూ నష్టపరిహారంతో సహా నియంత్రణ సడలింపులను సైతం కోరారు ఫైజ‌ర్ ప్ర‌తినిధులు.

అటు మోడెర్నా కూడా 5 కోట్ల డోసుల‌ను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఏడాదిలో అందిస్తామ‌ని చెప్పింది. ఈ ఏడాది భార‌త్ కు స‌ప్లై చేయ‌డానికి మిగులు వ్యాక్సిన్లు లేక‌పోవ‌డం వ‌ల్లే ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు చెప్పారు. ఈ సంస్థ వ్యాక్సిన్ ఇండియాలో సిప్లా సంస్థ ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ రెండు సంస్థ‌లు ప‌లు రిలాక్సేష‌న్లను కేంద్రం ముందు ఉంచిన‌ట్టు తెలుస్తోంది. కాగా.. కేవ‌లం ముంద‌స్తు స‌న్న‌ద్ధ‌త లేక‌పోవ‌డం.. కొవిడ్ సెకండ్ వేవ్ మొద‌లైన త‌ర్వాత కూడా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News