బీసీసీఐ మేల్కొంది.. రిషబ్ పంత్ కు మూడింది.. ఇక కేఎల్ రాహుల్ యే తరువాయి

Update: 2022-12-29 01:30 GMT
రికార్డులు చూసి.. భారీతనం చూసి టీమిండియాలో చోటు కల్పిస్తే ఆసియాకప్, టీ20 కప్ లో ఎలా తేలిపోయిందో చూశాం. అందుకే ఇక ఆడేవాళ్లకే చోటు కల్పించాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. తాజాగా శ్రీలంకతో సిరీస్ సందర్భంగా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది. వరుసగా విఫలమవుతున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై వేటు వేసింది. మంచి క్రికెట్ ఆడే సంజూ శాంసన్ కు జట్టులో చోటు కల్పించింది. ఎట్టకేలకు యువకులకు పెద్దపీట వేసి బీసీసీఐ ఇన్నాళ్లకు మేల్కొంది.

టీమిండియాలోని ఆటగాళ్ల వాపును చూసుకొని ఇన్నాళ్లు మురిసిన బీసీసీఐ ఇప్పుడు తేరుకొని గెలిపించే ఆటగాళ్లకు పెద్దపీట వేయడం ప్రారంభించింది. సీనియర్లు అందరినీ టెస్టులు, వన్డేలకే పరిమితం చేసి యువతకు టీ20లో పెద్దపీట వేసింది. టీ20 జట్టు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యాను నియమించింది. ఎన్నాళ్లుగానో అవకాశం కోసం చూస్తున్న యువకులకు అవకాశమిచ్చింది.  బీసీసీఐ నిర్ణయం పట్ల ఇన్నాళ్లకు హర్షం వ్యక్తమవుతోంది.

శ్రీలంకతో జరిగే మూడు టీ20 లు, మూడు వన్డేలకు మంగళవారం రాత్రి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్టుగానే గుజరాత్ ను ఐపీఎల్ చాంపియన్ చేసిన హార్ధిక్ పాండ్యాకు జట్టు కెప్టెన్ గా నియమించింది. సీనియర్లు కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాట్స్ మెన్లు కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతిని ఇచ్చింది. ఇక వరుసగా విఫలమవుతున్న వన్డే కెప్టెన్ ధావన్ ను పూర్తిగా పక్కనపెట్టింది.

విశేషం ఏంటంటే.. చాలా రోజులుగా ఆడకున్నా టీమిండియాలో చోటు దక్కించుకుంటున్న రిషబ్ పంత్ ను తొలగించాలని ఎంతో మంది డిమాండ్ చేశారు. ఎట్టకేలకు రెండు ఫార్మాట్లలోనూ రిషబ్ పంత్ ను తొలగిస్తూ బీసీసీఐ షాక్ ఇచ్చింది.

ఇక రిషబ్ పంత్ లాగానే ఫాం కోల్పోయిన కేఎల్ రాహుల్ ను సైతం టీ20ల నుంచి తొలగించి కేవలం వన్డేల్లోనే చోటు కల్పించింది. ఇక అతడికి షాకిస్తూ అతడి వైస్ కెప్టెన్సీని తొలగించింది. కేవలం ఆటగాడిగానే చోటు ఇచ్చింది. ఈసారి శ్రీలంకపై కూడా ఆడకుంటే కేఎల్ రాహుల్ కు ఉద్వాసన తప్పదు. అదే సమయంలో వన్డేలకు కూడా ‘హార్ధిక్ పాండ్యా’నే వైస్ కెప్టెన్ గా నియమించింది.

ఓవరాల్ గా చూస్తే రోహిత్ ను కూడా పక్కనపెట్టి టీమిండియా నయా కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యాకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆడని వారిని పక్కనపెట్టి సంజూ శాంసన్ సహా యువతకు పెద్దపీట వేసింది.

ఇక టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ కు ప్రమోషన్ ఇచ్చి ఏకంగా వైస్ కెప్టెన్సీ అప్పగించింది. హార్దిక్ తర్వాత టీ20ల్లో అతడికే కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ ఎంపికతో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ లకు గట్టి షాకిచ్చింది బీసీసీఐ.

-టీమిండియా వన్డే జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, ఇషాన్, హార్దిక్ (వైస్ కెప్టెన్), సుందర్, చాహల్, కుల దీప్, అక్షర్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్శ్ దీప్.


-టి20 జట్టు :

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్, రుత్ రాజ్, గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), హుడా, త్రిపాఠీ, శాంసన్, సుందర్, చాహల్, అక్షర్, ఆర్ష్ దీప్, హర్షల్, ఉమ్రాన్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News