అందుకే ఇంటింటికీ తిరుగుతున్నాం.. సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు

Update: 2022-07-19 12:30 GMT

కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు.. సీఎం జగన్ తెలిపారు. పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.. అర్హుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగకూడదని.. సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.

కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు.. ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గతంలో వివిధ కారణాలతో పథకాలు అందని 3 లక్షల 40 వేల మందికి ఇప్పుడు లబ్ధి చేకూరుస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం ఆన్‌లైన్‌ ద్వారా సమావేశం నిర్వహించారు.

పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.. అర్హుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగకూడదని ఆదేశించారు. మంచి పనులు చేశాం కాబట్టే ఇంటింటికీ రాగలుగుతున్నామని అన్నారు. అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రసంగించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమంలో భాగంగా..  తాజాగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించింది. కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్‌.  ‘ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. మరో 3 లక్షలకు పైగా కుటుంబాలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అర్హత ఉన్న ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడద’’ని ఈ సందర్బంగా పేర్కొన్నారు ఆయన.

దరఖాస్తు చేసిన 3,39, 096 మందికి సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వైఎస్సార్‌ పింఛన్‌ కానుకకు కొత్తగా 2,99,085 మందిని ఎంపిక చేసినట్లు.. అదే విధంగా కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసినట్లు సీఎం జగన్‌ వెల్లడించారు.

న్యాయంగా.. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా.. పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంకల్పమని సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సంబంధిత మంత్రులకు, అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.
Tags:    

Similar News