అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం.. మండిపోతున్న ధరలు

Update: 2022-06-17 00:30 GMT
అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి జారిపోతుందా? తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాపై ఆంక్షలు బూమరాంగ్‌ అవుతున్నాయా? యుద్ధ సామగ్రిని మొత్తం ఉక్రెయిన్ కు ఇవ్వడంతో స్టాక్‌లను తగ్గించి, మొత్తం మనీ మార్కెట్‌ను టెయిల్‌స్పిన్‌లోకి తీసుకువచ్చి అసంబద్ధ నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థను దిగజార్చారా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కారణంగా గత నెలలో ఊహించని దానికన్నా వేగంగా అమెరికాలో ధరలు పెరిగిపోయాయి. ఆహార, ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో ద్రవ్యోల్బణం రేటు 1981 తర్వాత అత్యధిక స్థాయికి పెరిగింది.

ఏప్రిల్ లో కొంత తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు మే నెలలో 8.6 శాతానికి పెరిగిందని లేబర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. పెరిగిపోతున్న జీవన వ్యయం ప్రజలను పిండేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ మీద ఇది ఒత్తిడిని పెంచుతోంది.

ఈ పరిస్థితుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. ఈ చర్యలు ఆర్థిక కార్యకలాపాలను చల్లబరిచే పనిని ప్రారంభించాయని, ధరల ఒత్తిడిని తేలికపరుస్తున్నాయని విశ్లేషకులు ఆశిస్తున్నారు.

కానీ రష్యా, ఉక్రెయిన్ ల ఘర్షణ వల్ల ఆ రెండు దేశాల నుంచి ఎగుమతులు పడిపోవడంతో చమురు ధరలు, గోధుమల వంటి సరుకుల ధరలు పెరిగిపోయాయి. ఈ యుద్ధం కారణంగా ధరల సమస్యను పరిష్కరించడం మరింత కష్టంగా మారింది.

ఆహార పదార్థాల ధరలు 2021 మే నెలతో పోలిస్తే గత నెలలో 10శాతానికి పైగా పెరిగాయి. ఇక ఇంధన ధరలైతే ఏకంగా 34 శాతానికి పైగా పెరిగిపోయాయి. అయితే ఈ పెరుగుదలలు ఆర్థిక వ్యవస్థ అంతటా వ్యాపించడం కొనసాగుతోందని లేబర్ మినిస్ట్రీ నివేదిక చెబుతోంది. ఫలితంగా విమానాల టికెట్లు మొదలుకొని దుస్తులు, వైద్య సేవల ధరలు కూడా అత్యధికంగా పెరిగిపోయాయి.

అమెరికాలో వినియోగ వస్తువుల ధరలు ఊహించిన దానికి మించి పెరిగిపోయాయి. ఇది మంచిది కాదు. ద్రవ్యోల్బణం వార్షిక పెరుగుదల రేటు 8.6 శాతంగా ఉండటమనేది 40 ఏళ్లలో అత్యంత వేగవంతమైన పెరుగుదలగా ఫైనాన్షియల్ అనలిస్టులు చెబుతున్నారు.

అమెరికాలో గత ఏడాది నుంచి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. బలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ అసాధారణ రీతిలో కరోనా ధాటికి కుదేలుకాగా.. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి అమెరికా ప్రభుత్వం భారీ స్థాయిలో వ్యయాలు చేసింది. ప్రజల ఇళ్లకు నేరుగా నగదు చెక్కులు పంపించడం వంటి చర్యలు కూడా ఇందులో ఉన్నాయి. సరుకులు పెరగడంతో కంపెనీలు ధరలను పెంచాయి.

ఇప్పుడు ఉక్రెయిన్ లో యుద్ధం ఈ సమస్యను ప్రపంచమంతటికీ విస్తరించింది. మరోవైపు చైనా లాక్ డౌన్లు కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. పెరుగుతున్న ధరలు ప్రజల కొనుగోళు శక్తిని దెబ్బతీస్తుండడంతో వారు ఖర్చు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చాలా దేశాల్లో ఆర్థిక వృద్ధిని వేగంగా తిరోగమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ద్రవ్యోల్బణం నివేదికలు చూసి అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రధానమైన మూడు సూచీలు 2 శాతానికి పైగా పడిపోయాయి. నిజానికి ఆర్థిక వ్యవస్థ దిశను చూసి పెట్టుబడిదారులు ఆందోళన చెందుతుండడంతో అమెరికా షేర్లు దిగజారిపోతున్నాయి.
Tags:    

Similar News