ది అమరావతి ఫైల్స్...రెడీ ?

Update: 2022-03-19 07:34 GMT
కళ అన్నది చాలా గొప్పది. ఎంతటి కఠిన చిత్తుడికైనా మనసు కరిగించేది. ఆలోచింపచేసేది. మామూలు మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను కళా రూపాల ద్వారా చెప్పవచ్చు. ఇది ఏనాడో రుజువైన సత్యం. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ కళలను రాజకీయాలకు వాడుకుంటున్నారా అంటే అవును అనే జవాబు వస్తుంది. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ నిజానికి చరిత్రలో దాగిన చీకటి కోణాన్ని వెలికి తీసే ప్రయత్నంగా కొందరు ఔత్సాహీకులు తీసారు.

అయితే దాని మీద సర్వ హక్కులు తమవేనంటూ బీజేపీ గ్రాబ్ చేస్తోంది. ఆ చిత్రాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటోంది. ఇపుడు హిందీలో తీసిన ఈ మూవీని దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలలోకి నిర్మాత డబ్ చేయనున్నారు. ఇదంతా బీజేపీ మార్క్ హిందూత్వకు బలమైన ఊతంగానే ఉంటుంది అని వేరేగా చెప్పాల్సిన పని లేదు.

నిజానికి కాశ్మీర్ ఫైల్స్ మూవీ మన దేశంలో మూడు దశాబ్దాల క్రితం జరిగిన దురంతాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. నాడు ఏలికలు ఎవరు, రాజకీయం ఏంటి అన్నది పక్కన పెడితే మనమంతా సిగ్గుపడాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక సామాజిక చైతన్యంగా ఆ మూవీని చూడాలి.

కానీ బీజేపీ మాత్రం ఈ మూవీని బాగా ఎత్తేస్తోంది. చాలా రాష్ట్రాలలో పన్ను మినహాయింపు కూడా బీజేపీ ఇచ్చింది. మొత్తానికి చూస్తే ది కాశ్మీర్ ఫైల్స్ దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ని తెచ్చింది అనే అంటున్నారు

ఇక మీదట తమ ప్రత్యర్ధి పార్టీలు చేసే తప్పులను ఏకిపారేయడానికి బలమైన సినిమా మాధ్యమాన్ని ఎన్నుకోవడం ఉత్తమ మార్గమని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని ఆవశ్యకతను తెలియచేస్తూ ఒక చిత్రాన్ని ఈ రోజు మొదలుపెట్టారు.

దీని వెనక అమరావతి జేయేసీ ఉందని అంటున్నారు. వారే నిర్మాతలుగా ఈ మూవీని తీస్తున్నారు. మూడేళ్ళ పాటు దాదాపుగా ఎనిమిది వందల రోజులు అమరావతి రాజధాని కోసం చేసిన ఉద్యమం, ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం, దాన్ని ఎదిరించిన వారి మీద జరిగిన నిర్బంధం, ఉద్యమకారుల రణ నినాదాలు, వారి పోరాట పటిమ, వారి త్యాగాలు, ముప్పయి మూడు వేల ఎకరాలను తృణప్రాయంగా అమరావతి రాజధాని కోసం ఇచ్చిన  వైనం ఇవన్నీ కళ్ళకు కట్టినట్లుగా ఈ మూవీలో చూపిస్తారు అంటున్నారు.

అదే కాదు, అమరావతి రాజధాని గురించి బయట సమాజానికి తెలియాల్సినంతగా తెలియలేదని అందుకే ఈ సినిమా ద్వారా అన్ని విషయాలు తెలియచెబుతామని అంటున్నారు. ఈ సినిమా ద్వారా అమరావతికి భూములు ఇచ్చిన రైతులు,  వారి కష్టాలు, కడగండ్లూ, రైతు కూలీలు, నిర్వాసితులు అయిన వారి గోడు అన్నీ కూడా చక్కగా చూపిస్తారు అని చెబుతున్నారు.

అమరావతిలో ఈ రోజు తొలి షాట్ తో ప్రారంభమైన ఈ మూవీ సరైన సమయంలో రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. ఈ మూవీలో అలనాటి హీరో హీరోయిన్లు వినోద్ కుమార్, వాణీ విశ్వనాధ్ కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు.

అమరావతి ఉద్యమ జేయేసీ నేతలు బెల్లంకొండ నరసిం హారావు, పువ్వాడ సుధాకర్ వంటి వారు ఈ మూవీ ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. ఈ మూవీ షూటింగ్ అంతా అమరావతి పరిసరాలలో జరుగుతుంది అని తెలుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో అమరావతి రాజధాని అతి కీలకమైన అంశమని అందరికీ తెలుసు.

దాని మీద ఒక చిత్రాన్ని రూపొందించి రిలీజ్ చేస్తే దీన్ని కూడా తమ సొంతం చేసుకునే పార్టీలు ఏపీలో ఉన్నాయి. అధికార వైసీపీకి ఇరకాటంగా ఉండే ఈ మూవీ వెనక ఏ రాజకీయ పెద్దలు లేరని అంటున్నా ఇది కూడా ది అమరావతి ఫైల్స్ గా జనాల్లోకి రానుంది అంటున్నారు. ఈ మూవీ కనుక షూటింగ్ చేసుకుని రిలీజ్ దశకు వస్తే ఇక దీని తరువాత వచ్చే మూవీ త్రీ క్యాపిటల్స్  ఫైల్స్ మాత్రమే. సో ఏపీలో సినీ రాజకీయ యుద్ధం మొదలైపోయింది అన్న మాట.  మొత్తానికి ఈ రకమైన కొత్త ఆలోచనలకు తావిచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ మేకర్స్ రాజకీయ జీవులు థాంక్స్ చెప్పుకోవాలసిందే సుమా.
Tags:    

Similar News